హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్‌రెడ్డి బాటలోనే కమిషన్ సభ్యులు కూడా ముందుకెళ్తున్నారు. ఇటీవలే జనార్దన్‌రెడ్డి రాజీనామా చేయగా.. కమిషన్ సభ్యుడు ఆర్ సత్యనారాయణ తన రాజీనామాను సమర్పించారు. శుక్రవారం మరో ఇద్దరు సభ్యులు కారం రవీందర్‌రెడ్డి, లింగారెడ్డి రాజీనామా చేశారు. మూడురోజులుగా గవర్నర్ అపాయిట్మెంట్ అడుగుతుండగా, ఎలాంటి స్పందన లేకపోవడంతో సభ్యులిద్దరూ తమ రాజీనామా లేఖలను గవర్నర్ కార్యాలయానికి పంపించారు. టీఎస్పీఎస్సీలో చైర్మన్‌తోపాటు మొత్తం ఐదుగురు సభ్యులు ఉండగా, ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో ప్రస్తుతం సుమిత్రానంద్ తానోబా, అరుణకుమారి మాత్రమే సభ్యులుగా ఉన్నారు.
రవీందర్‌రెడ్డి ప్రకటన సారాంశమిదే
ఈ రోజు నేను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా తప్పుకుంటున్నాను.. ఈ పదవిలో 30 నెలలకు పైగా సేవలందించాను. నాకు ఈ అవకాశం కల్పించిన ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ధన్యవాదాలు. ఈ కాలంలో నాకు సహకారం అందించిన టీఎస్పీఎస్సీ చైర్మన్, సహచర సభ్యులు, కమిషన్ అధికారులు, ఉద్యోగులు అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు. టీఎస్పీఎస్సీలో ఇద్దరు చేసిన తప్పిదం మొత్తం కమిషన్‌ను తప్పుబట్టే స్థాయికి తెచ్చింది. ఇద్దరి స్వార్థంతో జరిగిన తప్పును కమిషన్‌కు ఆపాదించే ప్రయత్నం చేశారు. దీనిని కొంతమంది తమ స్వార్థపూరిత రాజకీయాలకు వాడుకొని మాపై పదే పదే అక్కసుతో కూడిన ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో నేను నాయకత్వం వహించిన ఉద్యోగులు ఎన్నో కష్టాలను, నిర్బంధాలను, కేసులను ఎదురొన్నారు. చివరి వరకూ.. కలబడి, నిలబడ్డారు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఉద్యమాలు చేసి.. తెలంగాణను సాధించాం.
నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన అంశంగా ఉద్యమాలు చేశాం. తెలంగాణ ఉద్యమంలో ప్రజలపక్షాన పోరాటాలు చేసేన నేను ఆ కల సాకారమైన తర్వాత నిరుద్యోగులకు న్యాయం చేయాలనే సంకల్పంతో టీఎస్పీఎస్సీ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించాను. అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించడంతో యువతకు ఉద్యోగాలు వస్తాయని సంతోషపడ్డాం. కానీ.. టీఎస్పీఎస్సీలో ఇద్దరు వ్యక్తుల తప్పిదం వల్ల సంస్థ మనుగడకే నష్టం వాటిల్లింది. ఎలాంటి సంబంధం లేని సభ్యులు సైతం అపవాదులు మోయాల్సి వచ్చింది. అయినప్పటికీ నిరుద్యోగులకు తొందరగా ఉద్యోగాలు కల్పించాలని తపనతో కష్టపడి పనిచేశాం. దేశంలో ఏ పీఎస్సీ చేయని ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చాం. ఎంతో పారదర్శకతను ప్రవేశపెట్టాం. నిరుద్యోగులు ఇకనైనా అపోహలు వీడాలి. విశ్వాసంతో ముందుకు సాగండి. మేము ఎప్పటికీ ఉద్యమకారులమే.. నిరుద్యోగుల పక్షమే. జై తెలంగాణ.
పోరాటాలే తప్ప పొరపాట్లు తెలియవు
టీఎస్పీఎస్సీ సభ్యుడిగా రాజీనామా చేసిన తర్వాత కారం రవీందర్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఎస్పీఎస్సీ సభ్యుడిగా తనకెప్పటికీ ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన పొరాడటమే తప్ప.. పొరపాట్లు చేయడం అలవాటు లేదని స్పష్టం చేశారు.