హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకాలను రద్దు చేయాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నియామకాలకు సంబంధించి 2021 మే 19న జారీచేసిన జీవో 108ను రద్దు చేసే ప్రశ్నే లేదని స్పష్టం చేసింది. అయితే, ఈ రాష్ట్ర ప్రభుత్వ తాజా పరిశీలనకు లోబడి ఉండాలని పేర్కొన్నది. 3 నెలల్లోగా సభ్యుల నియామక ప్రక్రియను పునఃసమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం శుక్రవారం 80 పేజీల తీర్పును వెలువరించింది. టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకాలు చట్టవ్యతిరేకంగా జరిగాయంటూ 2021లో ప్రొఫెసర్ ఏ వినాయక్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సుదీర్ఘ వాదనల తర్వాత నిరుడు డిసెంబర్ 1న తీర్పును వాయిదా వేసిన హైకోర్టు.. ఆ తీర్పును ఇప్పుడు ప్రకటించింది.