ఖైరతాబాద్, జూన్ 22: ఎన్నో ఆశలు, ఆశయాలతో కష్టపడి చదివి గ్రూప్-1లో ర్యాంకు సాధించాం.. కానీ, నియామక పత్రాలు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది.. అసలు ఎప్పుడిస్తరు? అని టీజీపీఎస్సీ గ్రూప్-1 సెలెక్టెడ్ అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం మీడియా సమావేశంలో పలువురు అభ్యర్థులు తమ అవేదనను వెలిబుచ్చారు. అభ్యర్థులు నిషాంత్, రంజిత్, సందీప్‌కుమార్, వేద మాట్లాడుతూ టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో ర్యాంకులు సాధించి ఉద్యోగాలకు అర్హత సాధించామని తెలిపారు.
583 మంది అభ్యర్థులు నియామకపత్రాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది మార్చి 30న జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ విడుదల చేసిందని, అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు తదితర ప్రక్రియలు పూర్తయ్యాయని వివరించారు. నియామకాలు చివరి దశకు చేరుకున్నాయని, గ్రూప్-1 అధికారులుగా విధుల్లో చేరేందుకు సన్నద్ధంగా ఉన్న తాము నియామక పత్రాలు అందుకోవాల్సి ఉండగా, ప్రభుత్వ చర్యలు నిరాశపరిచాయని ఆవేదన వ్యక్తంచేశారు. నియామకాల విషయంలో ఎటూ తేలకపోవడంతో తమ తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఉద్యోగ విధుల్లో చేరాలనుకున్న తమ లక్ష్యానికి నియామకపత్రాల ఆలస్యం.. మానసిక ఆందోళనకు గురిచేస్తున్నదని, ప్రభుత్వం ఇప్పటికైనా కనికరించి నియామకపత్రాలు అందించాలని కోరారు.
మా నాన్న రవీందర్ రైతు. మా కుటుంబానికి వ్యవసాయమే జీవనాధా రం. గ్రూప్-1లో అర్హత సాధించడానికి గత మూడేండ్లు కష్టపడి చదివా. అశోక్‌నగర్‌లో కిరాయి రూమ్‌లో ఉంటూ పరీక్షలకు సన్నద్ధమయ్యాను. ఎంతో కష్టపడి చదివి గ్రూప్-1 సాధిస్తే ప్రభుత్వ చర్య బాధ కలిగించింది.
– శివకుమార్, కరీంనగర్
మాది నారాయణపేట. మా నాన్న శ్రీనివాస్ ఆర్టీసీ బస్ కండక్టర్. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివాను. నాన్న సంపాదనపైనే మా కుటుంబం ఆధారపడింది. గ్రూప్-1లో అత్యుత్తమ ర్యాంకు వచ్చింది. డిప్యూటీ కలెక్టర్ కావాలన్నది నా జీవితాశయం. ప్రభుత్వం కనికరించి నియామక పత్రం అందజేయాలి
– ఎస్ వీణ, సెలెక్టెడ్ అభ్యర్థి