హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1మెయిన్స్ పరీక్షల నిర్వహణలో కాంగ్రెస్ సర్కారు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వరుసగా కాపీయింగ్ కేసులు బయటపడుతుండటంతో ఏం జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షలకు కల్పిస్తున్న భద్రత డొల్లేనన్న వాదనలొస్తున్నాయి. సీవీఆర్ కాలేజీలో కాపీయింగ్ ఉదంతం చోటుచేసుకోగా, సైనిక్‌పురి భవన్స్ కాలేజీలో సీల్‌లేని ప్రశ్నపత్రాలను అభ్యర్థులకు అందించారు. శనివారం నారాయణమ్మ కాలేజీలో కాపీయింగ్ ఘటన బయటపడింది. ఈ పరీక్షాకేంద్రంలో గంటన్నర తర్వాత అభ్యర్థిని పట్టుకున్నారు.
ఇలా వరుసగా కాపీయింగ్ కేసులు బయటపడుతుండటంతో అభ్యర్థులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ప్రశ్నలు లీకైతేనే చిట్టీలు తీసుకెళ్లే అవకాశముంటుందని ఆరోపిస్తున్నారు. పైగా గ్రూప్-1 పరీక్షాకేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షాకేంద్రానికి 20 మంది పోలీసుల చొప్పున డ్యూటీలు కేటాయించారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయినా చిట్టీలను పరీక్షాకేంద్రాల్లోకి ఎలా తీసుకెళ్లారా, ఇదంతా కావాలనే జరిగి ఉంటుందన్న ఆరోపణలొస్తున్నాయి. మాస్ కాపీయింగ్ అంటూ సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టీజీపీఎస్సీ ఖండించింది.
రెండు రోజుల్లో రోజుకొక్కరే కాపీయింగ్‌కు పాల్పడుతూ దొరికారని స్పష్టంచేసింది. కాగా గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. పేపర్ -7 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పేపర్‌కు పరీక్షను నిర్వహించారు. చివరి పరీక్షకు 31,383 మందికి 21,151(67.3శాతం) పరీక్షకు హాజరైనట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. మొత్తంగా పరీక్షలకు 10 వేలమంది (33శాతం) డుమ్మాకొట్టడం గమనార్హం.