TSPSC | హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ ఏఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో మరో ఇద్దరిని సిట్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో నిందితుల సంఖ్య 20కి, అరెస్ట్‌ల సంఖ్య 19కి చేరింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన సిట్.. గ్రూప్-1, ఏఈ, డివిజనల్ అకౌంట్స్ అఫీసర్స్ పేపర్‌ను కొనుగోలు చేసి పరీక్షలు రాసిన వారిని ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి, కోర్టు అనుమతితో వారిని కస్టడీలోకి తీసుకొని లోతుగా విచారిస్తుంది. ఇందులో భాగంగానే నిందితులు కస్టడీలో వెల్లడించిన అంశాలు, సిట్ సేకరించిన సాంకేతిక అంశాలు, పోటీ పరీక్ష రాసిన వారి వివరాలు, అందులో నిందితులతో సంబంధమున్న వారి గురించి ఆరా తీయడంతో తాజాగా ఏఈ పేపర్ కొనుగోలు చేసిన తండ్రీకొడుకుల విషయం వెలుగులోకి వచ్చింది.
టీఎస్పీఎస్సీలో పనిచేసే ప్రవీణ్‌కుమార్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డి కలిసి కస్టోడియన్ శంకర లక్ష్మి సిస్టమ్‌లో నుంచి ఆమెకు తెలియకుండా టీఎస్పీఎస్సీకి చెందిన ప్రశ్నా పత్రాలను అపహరించిన సంగతి తెలిసిందే. అందులో ఏఈ పేపర్‌ను మహబూబ్‌నగర్ జిల్లా, గండేడ్ మండలం, పగిడ్యాల పంచంగాల్ తాండకు చెందిన రేణుక, ఆమె భర్త ఢాక్య నాయక్‌లకు విక్రయించారు.
వికారాబాద్ జిల్లాలోని ఉపాధి హామీ పథకం విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గండేడ్ మండలానికి చెందిన మిబయ్యా కుమారుడు జనార్ధన్ ఏఈ పరీక్షకు సిద్దమవుతున్నాడు. అయితే మిబయ్యాతోనూ ఢాక్య నాయక్ ఏఈ పరీక్ష ప్రశ్నపత్రం గురించి చర్చించాడు. పరీక్ష పత్రానికి రూ. 6 లక్షలవుతుందంటూ బేరం పెట్టాడు. తన వద్ద అంత డబ్బు లేదని రూ. 2 లక్షలు మాత్రం ఇప్పుడిస్తానని, మిగతావి తరువాత చూసుకుందామంటూ మాట్లాడుకున్నారు. ఇలా తన వద్ద ఉన్న ఒక లక్ష రూపాయలు, మరో లక్ష అప్పుగా తెచ్చిన మిబయ్యా రూ. 2 లక్షలు ఢాక్య నాయక్‌కు అందించాడు.
దీంతో పరీక్ష పత్రం కొనుగోలు చేసిన మిగతా వారికి ఈ విషయం తెలియకుండా జనార్ధన్‌కు పరీక్షకు ఒక రోజు ముందు అంటే మార్చి 4వ తేదీన పరీక్ష పత్రం ఇచ్చిన తన ఇంట్లోనే సిద్దం కావాలంటూ సూచించాడు. రూ. 2 లక్షలే ఇచ్చావు కాబట్టి పరీక్ష పత్రాన్ని చూసుకోవడానికి అవకాశం ఇస్తున్నా, అదే మొత్తం రూ. 6 లక్షలు ఇస్తే జిరాక్స్ తీసి ఇచ్చేవాడినంటూ ఢాక్య నాయక్ వారితో చెప్పాడు. ఒక రోజు ముందు జనార్ధన్‌కు పరీక్ష పత్రం చూపించి, అతడిని పరీక్షకు సిద్దం చేసినట్లు విచారణలో వెల్లడైంది.