హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తేతెలంగాణ): పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు టీ-శాట్ గుడ్‌న్యూస్ చెప్పింది. ‘జనరల్ స్టడీస్ ఫర్ ఆల్’ పేరిట ఐదు నెలలపాటు అందించాలని నిర్ణయించింది. సోమవారం నుంచి పది సబ్జెక్టులను 600 ఎపిసోడ్స్‌లో ప్రసారం చేయనున్నట్టు సీఈవో బీ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిరోజూ రెండు గంటలపాటు సబ్జెక్ట్ నిపుణులతో క్లాసులు ఉంటాయని పేర్కొన్నారు.
టీజీపీఎస్సీ నిర్వహించే కాంపిటేటివ్ ఎగ్జామ్స్తోపాటు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు కొన్నేళ్లుగా ప్రామాణికమైన కంటెంట్‌ను అందిస్తున్నట్టు వెల్లడించారు. టీ-శాట్ నిపుణ చానల్లో ప్రతిరోజూ మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట, 3 నుంచి 4 గంటల వరకు ప్రసారం చేస్తామని వెల్లడించారు. విద్య చానల్లో అదే రోజు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు పునఃప్రసారమవుతాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమం, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీతోపాటు సోషల్ ఎక్స్‌క్లూజివ్, జనరల్ ఇంగ్లిష్ సబ్జెక్టులను టెలీకాస్ట్ చేయనున్నట్టు వివరించారు. ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.