హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : విదేశీ స్కూళ్లు, విద్యాలయాలకు రెడ్‌కార్పెట్ పరచడాన్ని టీఎస్ యూటీఎఫ్ తప్పుబట్టింది. యూకేకు చెందిన ప్రైవేట్ పాఠశాలలను ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించడంపై అభ్యంతరం వ్యక్తంచేసింది. విదేశీ స్కూళ్లతో అధికారులు చర్చలు జరిపి ఆహ్వానించడంపై సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి విస్మయం వ్యక్తంచేశారు. ఇలాంటి చర్యలు మానుకొని సర్కార్ బడుల బలోపేతంపై దృష్టిసారించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ఆఫీసు బేరర్ల సమావేశాన్ని శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా చావ రవి సర్కార్ తీరును తప్పుబట్టారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ స్కూళ్లను ఆహ్వానిస్తున్నారని ప్రశ్నించారు. ప్రాథమిక బడుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి తరగతులు ప్రారంభించాలని సూచించారు. ఈనెల 29న ఆలంపూర్లో జరిగే రాష్ట్ర కమిటీ సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్ వెల్లడించారు. సమావేశంలో ఉపాధ్యక్షులు దుర్గాభవాని, రాజశేఖర్‌రెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, సత్యానంద్ పాల్గొన్నారు.