రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు వ్యవసాయ అనుబంధ రంగాలను విశేషంగా అభివృద్ధి చేస్తున్నాం. ఏకకాలంలో ఐదు విప్లవాలకు నాంది పలికాం. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. ప్రస్తుత ఫుడ్ కాంక్లేవ్ ఆరంభం మాత్రమే, భవిష్యత్తులో ఇలాంటివి ప్రతిఏటా నిర్వహిస్తాం.
-మంత్రి కేటీఆర్
Minister KTR | హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఫుడ్ కాంక్లేవ్‌లో ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడుల వరద పారింది. ఈ రంగంలో ఒకేరోజు రికార్డుస్థాయిలో రూ.7,217.95 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు 27 కంపెనీలు ముందుకొచ్చాయి. తద్వారా ఇక్కడి యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 58,458 ఉద్యోగాలు లభించనున్నాయి. మొత్తం పెట్టుబడుల్లో ఆయిల్‌పామ్ విభాగంలో టీఎస్ ఆయిల్‌ఫెడ్ టాప్‌లో నిలిచింది. ఈ సంస్థ రూ.1,055 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా 14,600 మందికి ఉపాధి చూపనున్నది. ఆ తర్వాత పతంజలి సంస్థ రూ.1,050 కోట్ల పెట్టుబడితో 2,900 మందికి ఉపాధి కల్పించనున్నది. శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఫుడ్ కాంక్లేవ్-2023ని మంత్రులు నిరంజన్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, తెలంగాణ సర్కారు ఆహారశుద్ధి రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని రాష్ట్ర పేర్కొన్నారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు వ్యవసాయ అనుబంధ రంగాలను విశేషంగా అభివృద్ధి చేస్తున్నామని, ఇందులోభాగంగా ఏకకాలంలో ఐదు విప్లవాలకు నాంది పలికినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని ఉద్ఘాటించారు. ప్రస్తుత ఫుడ్ కాంక్లేవ్ ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఇలాంటివి ప్రతిఏటా నిర్వహిస్తామని వెల్లడించారు. కాంక్లేవ్‌లో భాగంగా 21 బృంద చర్చలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో వందకుపైగా ప్రముఖ కంపెనీల సీఈవోలు, నిపుణులు పాల్గొంటారని చెప్పారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ, చేపలు, గొర్రెలు, వంట నూనెల ఉత్పత్తి తదితర ఐదు రంగాలకు సంబంధించి ఇందులో చర్చించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా, పౌల్ట్రీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉందని తెలిపారు. ప్రస్తుతం దేశంలోనే మొట్టమొదటి ఇన్లాండ్ ఫిషరీష్ హబ్‌గా ఎదిగిందని పేర్కొన్నారు. గొర్రెలు, మేకల సంఖ్యలో దేశంలో మొదటి రాష్ట్రంగా, డెయిరీ ఇండస్ట్రీలో నాయకత్వ హోదాని సొంతం చేసుకున్నదని వివరించారు.
టీఎస్ ఆయిల్‌ఫెడ్
1,055రూ.కోట్లు 14,600 ఉద్యోగాలు
పతంజలి
1,050 రూ.కోట్లు 2,900 ఉద్యోగాలు
రాష్ట్రంలో ఇప్పటికే వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ, ఫారెస్ట్ యూనివర్సిటీలు ఉన్నాయని, త్వరలోనే ఆక్వా యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఆహారశుద్ధి రంగంలో రాష్ర్టానికి ఐదేండ్లలో రూ.7 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. కోకాకోలా, ఐటీసీ, పెప్సీకో, మార్స్, హాట్సన్ తదితర ప్రపంచస్థాయి కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని, ఎనిమిదేండ్లలో అనేక బహుళజాతి సంస్థలు, జాతీయ కంపెనీలు తమ పెట్టుబడులకోసం తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకొన్నాయని చెప్పారు.
సీఎం కేసీఆర్ ఆకాంక్షల మేరకు ఆహారశుద్ధి రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటుచేశామని, 10 వేల ఎకరాల్లో ఆహారశుద్ధి పరిశ్రమలను ఏర్పాటుచేస్తున్నామని, ఇందుకు అవసరమైన ప్రత్యేక ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. టీఎస్ ఐ-పాస్ ద్వారా ఇప్పటికే సులభతరంగా అనుమతులు జారీచేస్తున్నామని, అనుమతి కోసం దరఖాస్తు చేసిన వెంటనే పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభించుకోవచ్చని తెలిపారు. ఏ ఇతర రాష్ట్రమైనా తెలంగాణకన్నా మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తే, అంతకన్నా మెరుగైన ఆఫర్‌ను, ప్యాకేజీని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఇదే తెలంగాణ రాష్ట్ర విధానమని.. ఇదే అనేక రంగాల్లో నేడు తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలిపిందని తెలిపారు.
ఆహారశుద్ధి పరిశ్రమ ప్రోత్సాహంలో భాగంగా వ్యవసాయ, పరిశ్రమ రంగాలకు మధ్య సైప్లె లింక్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు కూడా కృషిచేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 25 వేలకుపైగా రైతుబంధు సమితులు ఉన్నాయని, వీటితోపాటు 12,769 గ్రామాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలు చురుకుగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పొదుపు సంఘాలు ఏటా రూ.15 వేల కోట్ల రుణాలు తీసుకొంటూ తిరిగి చెల్లిస్తున్నాయని తెలిపారు. ఆహారశుద్ధి పరిశ్రమ వీటితో సమన్వయం చేసుకొని ముందుకుసాగే అవకాశముందని తెలిపారు.
ఆహారశుద్ధి రంగంలో ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాన్ని కల్పించేందుకు రైతు ఉత్పత్తి సంస ్థ(ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్)ను ఏర్పాటుచేస్తున్నట్టు వెల్లడించారు. ఈ రంగంలో సూక్ష్మ, చిన్న పరిశ్రమలను కూడా ప్రోత్సహిస్తున్నామని, ఇందులోభాగంగా దళిత బంధువంటి పథకాల ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 2,500 చిన్న, సూక్ష్మ పారిశ్రామికవేత్తలు ఆహారశుద్ధి రంగంలో పరిశ్రమలు ఏర్పాటుచేశారని చెప్పారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో నలుగురు దళిత బంధు లబ్ధిదారులు కలిసి 3 కోట్లతో రైస్‌మిల్లును ఏర్పాటుచేశారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్య రంగాల్లో వ్యవసాయం అగ్రభాగాన ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో వ్యవసాయరంగంలో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. వ్యవసాయరంగం అభివృద్ధితో ఇప్పుడు రాష్ట్రం వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల ఆహారశుద్ధి రంగంపై దృష్టి కేంద్రీకరించినట్టు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 27.52 లక్షల మంది లైఫ్స్టాక్ సెక్టార్లో ఉపాధి పొందుతున్నారని చెప్పారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన ఇన్లాండ్ ఫిషరీస్ ప్రాజెక్టుతో ఏటా 2.24 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి చేసే అవకాశం ఉందని, దీంతో 5 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రెష్ వాటర్ ఆక్వా హబ్ అని తెలిపారు. కార్యక్రమంలో నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ రమేశ్‌చంద్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్‌రంజన్, వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి ఎం రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఫుడ్ కాంక్లేవ్ పోస్టర్‌ను మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంతా తౌటం మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న ఆవిష్కరణలకు ఊతం ఇస్తూ సమగ్రమైన వ్యయంతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోని సమస్యలకు స్టార్టప్‌లు, మహిళలు, యువత, స్వయం సేవా సంఘాలు ఆవిష్కర్తల ద్వారా పరిష్కారమార్గాలను కనుగోనే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు.