Minister Puvvada | ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో ఈ నెల 12న జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన మృతులకు, గాయ పడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. నలుగురు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, గాయపడిన ఐదుగురికి రూ.2.50 లక్షల చొప్పున మంగళవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు.
కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ తాతా మధు, జిల్లా కలెక్టర్ వీపీ గౌతం, సింగరేణి మండల ఎంపీపీ మాలోత్ శకుంతల, చీమల పాడు సర్పంచ్ మాలోత్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

చీమలపాడు ఘటన బాధాకరం అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఘటనలో మరణించిన నలుగురి కుటుంబాలు, గాయపడిన ఐదుగురి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందన్నారు.
బాధిత కుటుంబాలను పువ్వాడ పరామర్శించి ఓదార్చారు. ఘటన జరిగిన రెండు వారాల్లోనే బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్న సంకల్పంతో సర్కార్ వారికి నష్ట పరిహారం అందజేసిందన్నారు.

ప్రమాదం జరిగినప్పటి నుంచి బాధితుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం నిత్యం దృష్టి సారించిందని పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.
ప్రమాదంలో గాయపడిన రోజు నుంచి వారికి సరైన చికిత్స అందించడానికి తీసుకుంటున్న చర్యలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిత్యం పర్యవేక్షిస్తున్నారని, ఆ కుటుంబాలకు తోడుగా ఉన్నారని పువ్వాడ పేర్కొన్నారు.

ఈ దుర్ఘటన బాధితులకు నష్ట పరిహారం ఇవ్వడంతోపాటు మృతుల కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇస్తున్నట్లు పువ్వాడ ప్రకటించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్కు తగిన ఆదేశాలు జారీ చేశామన్నారు.
అంగ వికలాంగులైన వారికి కృత్రిమ అవయవాలు అందజేసి, వారి కుటుంబాల జీవనోపాధికి తగు చర్యలు తీసుకుంటామని పువ్వాడ చెప్పారు.

మృతులు, గాయపడిన వారి పిల్లలకు వారు కోరుకున్న చోట రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యను అందిస్తామని, అందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చామని పువ్వాడ తెలిపారు.
ఈ నెల 12న చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాలుస్తుండగా, నిప్పు రవ్వ ఒక గుడిసెపై పడటంతో నిప్పంటుకున్న సంగతి తెలిసిందే. ఆ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలడంతో నలుగురు వ్యక్తులు మరణించగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

మృతి చెందిన బానోత్ జ్యోతి w/o రమేష్, దర్మసోత్ సరోజ, w/o లక్ష్మణ్, అజ్మీరా లలిత w/o మంగు, సందీప్ కుటుంబాలకు మంత్రి పువ్వాడ రూ.10 లక్షల చెక్ అందజేశారు. తీవ్రంగా గాయపడ్డ నారాటి వెంకన్న, తేజవత్ భాస్కర్, అంగొత్ కుమార్, దేవా నవీన్, కనగాల శ్రీనివాస్ కుటుంబాలకు రూ.2.50లక్షల చెక్కులను అందజేశారు.
