హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): దావోస్ పెట్టుబడులకు సంబ ంధించి సీఎం రేవంత్ మంగళవారం సచివాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌పై పారిశ్రామికరంగ నిపుణులు, నెటిజన్ల నుం చి సెటైర్లు పేలుతున్నాయి. తమ ప్రభుత్వం 13 నెలల్లో తీసుకొచ్చిన సరళీకృత ఆర్థిక వి ధానాల వల్లే దావోస్‌లో 1.80 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని సీఎం పేర్కొన్నారు. వాస్తవానికి.. రాష్ట్రంలో ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన టీఎస్ఐపాస్ విధానమే అమలవుతున్నదని నిపుణులు గుర్తుచేస్తున్నారు.
పాత పాలసీ లో ఎలాంటి మార్పులు చేయకుండా.. తమ ఘనతగా రేవంత్ ఎలా చెప్పుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పాలసీని ప్రకటించిందని, కానీ దాని అమలు ఎవరికీ తెలియదంటున్నారు. ఈ లెక్కన నిరుడు వచ్చిన 40 వేల కోట్లు, ఈసారి వచ్చిన 1.80 లక్షల కోట్ల పెట్టుబడులను టీఎస్ఐపాస్ విధానమే ఆకర్షించిందని స్పష్టం చేస్తున్నారు.
ప్రెస్మీట్లో సీఎం ఎక్కడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచిపై ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. 2004కు ముందున్న టీడీపీ ప్రభుత్వం గురించి మాట్లాడారే తప్ప బీఆర్ఎస్ పేరునుగానీ, కేసీఆర్ పేరునుగానీ ప్రస్తావించలేదు. పైగా తలసరి ఆదాయంలో తెలంగాణ ప్రస్తుతం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదని, దాన్ని కొనసాగిస్తామని చెప్పారు. గణాంకాల ప్రకారం 2015లో తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో 13వ స్థానంలో ఉన్నది. 2023-24 నాటికి మొదటిస్థానానికి ఎదిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయకుండానే ఇన్ని రాష్ర్టాలను దాటి అగ్రస్థానానికి చేరిం దా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
గతంలో దావోస్ పర్యటనలపై కాంగ్రెస్ తరఫున ఎవరూ విమర్శలు చేయలేదని చెప్పడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్ గతంలో చేసిన విమర్శలను గుర్తుచేస్తున్నారు. దావోస్‌కు ఆహ్వానం అందడం అంతా బూటకం అని, సాధారణంగా ఎవరు పోయి డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నా అనుమతి ఇస్తారని విమర్శించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. సౌత్ కొరియా, జపాన్ అంటూ తిరుగుతున్నారని, పెట్టుబడులు రావని, ప్రజల డ బ్బులతో విలాసవంతమైన ప్రయాణాలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ గతంలో వ్యాఖ్యానించారని అంటున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనలో ఉండగా ఈ వీడియో మరోసారి వైరల్ అయ్యింది. అయినా ఆ విషయాన్ని మర్చిపోయి గతంలో విమర్శించలేదని చెప్పడం ఏమిటని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎనర్జీ పాలసీ వల్లే పెట్టుబడులు వచ్చాయని సీఎం చెప్పడంపైనా నిపుణులు మండిపడుతున్నారు. 2014లో ధ్వంసమై ఉన్న విద్యుత్తు రంగాన్ని పునరుద్ధరించి 2023 నాటికి అన్ని రంగాలకు నిరంతర విద్యుత్తు ఇచ్చే స్థాయికి తీసుకొచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వ ఘతను కాంగ్రెస్ చెప్పకపోయినా ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్తున్నారు.