NCDC | హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ఓబీసీలను తామే ఉద్ధరించామని జబ్బలు చరుచుకొంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలు.. తెలంగాణలో మాత్రం ఆ ఓబీసీల నోటికాడి ముద్దను లాక్కొనే కుట్రలు చేస్తున్నారు. గొల్ల కురుమల స్వయం సమృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో ఆలోచించి, వ్యయప్రయాసలకోర్చి అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకోవాలన్న దుర్బుద్ధిని ప్రదర్శిస్తున్నది. రాష్ర్టానికి ఎన్సీడీసీ రుణం ఇవ్వకుండా కేంద్రం మోకాలడ్డినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గొర్రెల పంపిణీకి ఎన్సీడీసీ రుణం ఇవ్వకుండా వెనుకడుగు వేయటానికి కేంద్రమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రెండో విడత గొర్రెల పంపిణీ కోసం అవసరమైన రుణం ఇచ్చేందుకు మొదట అంగీకరించిన ఈ సంస్థ, ఆ తర్వాత కేంద్రం పెద్దల జోక్యంతో వెనక్కి తగ్గినట్టు తెలిసింది. కుంటి సాకులు చూపుతూ రుణం ఇవ్వడానికి తిరస్కరించింది. దీంతో పథకం అమలుకు సం బంధించి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చింది. రూ. వెయ్యి కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. రెండో దశ గొర్రెల పంపిణీని జూన్ 5వ తేదీ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
గొర్రెల పంపిణీ పథకానికి అవసరమైన ఆర్థిక వనరుల కోసం నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి పశు సంవర్ధకశాఖ రుణం తీసుకొంటున్నది. తొలిదశలో రూ.3,955 కోట్ల రుణం తీసుకొన్నది. తాజాగా రెండో దశ పంపిణీ కోసం రూ.4,563 కోట్ల రుణం కావాలని కోరింది. ఇందుకు ఎన్సీడీసీ అధికారులు రాష్ర్టానికి వచ్చి తనిఖీలు చేశారు. నాలుగుసార్లు తనిఖీలు చేసి అంతా బాగుందని రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ రిపోర్ట్ ఆధారంగా గత ఏడాది జూన్ 23న రుణం మంజూరు చేస్తూ పత్రం కూడా ఇచ్చింది. రుణం కోసం పశు సంవర్ధకశాఖ రూ.3.54 లక్షల ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించింది. దీంతో ఆ మొత్తాన్ని విత్డ్రా చేసుకొనేందుకు ఎన్సీడీసీని రాష్ట్ర అధికారులు సంప్రదించగా వారు అనుమతివ్వలేదు. కారణమేమిటని రాష్ట్ర అధికారులు ఆరా తీయగా ఏవేవో కుంటి సాకులు చెప్పినట్లు తెలిసింది.
గొర్రెల పంపిణీలో కేంద్రం ప్రభుత్వానిది నయా పైసా వాటా కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో దీన్ని అమలు చేస్తున్న ది. అయినా ఎన్సీడీసీని అడ్డుపెట్టుకొని గొర్రెల పంపిణీపై పెత్తనం చెలాయించాలని కేంద్రం ప్రయత్నిస్తున్నది. అందుకే రుణం మంజూరు కోసం పలు షరతులు పెట్టినట్టు తెలిసింది. ఎన్సీడీసీకి లాగిన్ ఇవ్వాలని, గొర్రెల పంపిణీ సందర్భంగా విజిట్ చేసేందుకు అనుమతి ఇ వ్వాలని, గొర్రెల పంపిణీపై సమీక్ష నిర్వహణకు అధికారం ఇవ్వాలంటూ పలు షరతులు పెట్టినట్టు సమాచారం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఓ ఉన్నతాధికారి ఇటీవల ఢిల్లీకి వెళ్లి ఎన్సీడీసీ అధికారులతో చర్చలు జరిపారు. ఆ సమయంలో షరతుల్లో కొన్నింటిని విరమించుకొన్న ఎన్సీడీసీ, రుణం ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలిసింది. ఆ తర్వాత బోర్డు అనుమతి తీసుకొని మంజూరు చేస్తామని హామీ ఇచ్చి.. తీరా ఇప్పుడు రుణాన్ని తిరస్కరించింది.
గొర్రెల పంపిణీ మొదటి విడత పంపిణీ కోసం ఎన్సీడీసీ నుంచి పశుసంవర్ధక శాఖ రూ.3,955 కోట్ల రుణం తీసుకొన్నది. ఈ రుణానికి సంబంధించి ఒక్క వాయిదా కూడా ఆసల్యం కాకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నది. ఇప్పటి వరకు మొత్తం రూ.4,068 కోట్లు చెల్లించింది. ఇందులో రూ.2,626 కోట్లు అసలు, రూ.1,442 కోట్లు వడ్డీ కింద చెల్లించింది. మొత్తం 16 వాయిదాలకు గాను ఇప్పటికే 12 వాయిదాలు చెల్లించిందని అధికారులు తెలిపారు. మరో 4 వాయిదాలు చెల్లిస్తే రుణం తీరిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఎన్సీడీసీ రెండో విడత రుణం ఇచ్చేందుకు నిరాకరించడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది.
ఎన్సీడీసీ కో-ఆపరేటివ్ శాఖ పరిధిలో ఉంటుంది. కేంద్రం ఇటీవల కో-ఆపరేటివ్ను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతిలోనే ఈ శాఖ కూడా ఉన్నది. గొర్రెల పంపిణీ రుణంపై ఆయన ఆరా తీసినట్టు తెలిసింది. ఆ తర్వాతే ఎన్సీడీసీ తెలంగాణకు రుణం ఇవ్వకుండా వెనక్కి తగ్గినట్టు స మాచారం. ఇక కో-ఆపరేటివ్ శాఖ కార్యదర్శే ఎన్సీడీసీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. రుణం మంజూరు చేసినప్పుడు, ఇప్పుడు ఒకే వ్యక్తి కార్యదర్శిగా ఉన్నారు. అప్పుడు రుణం మంజూరు చేసిన ఆయన.. ఇప్పు డు తిరస్కరించడం గమనార్హం.
రెండో విడత గొర్రెల పంపిణీకి ఎన్సీడీసీ రుణం ఇవ్వకపోవటం వెనుక బీజేపీ కుట్ర ఉన్నది. సీఎం కేసీఆర్ గొల్ల కురుమలకు మేలు చేయాలని తలంచితే, కేంద్రం మాత్రం అన్యాయం చేయాలని చూస్తున్నది. మంజూరు చేసిన రుణాన్ని నిలుపుదల చేయడం కక్ష సాధింపే. ఇందుకు బీజేపీ తగిన మూల్యం చెల్లించక తప్పదు.
-దూదిమెట్ల బాలరాజ్యాదవ్, గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్