శనివారం 06 జూన్ 2020
Telangana - May 08, 2020 , 02:05:23

రుణ మాఫీకి 1210 కోట్లు

రుణ మాఫీకి 1210 కోట్లు

  • రైతుల కర్జా మాఫ్‌
  • రూ.25 వేలలోపు రుణం ఒకే దఫాలో రద్దు
  • రైతుల బ్యాంకు ఖాతాల్లో వెంటనే జమ
  • వానకాలం రైతుబంధుకు 7 వేల కోట్లు
  • సమన్వయంతో ఆర్థిక, వ్యవసాయశాఖలు: మంత్రులు హరీశ్‌, నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవడానికి రూ.25 వేల లోపు ఉన్న రుణాలను ప్రభుత్వం ఒకేసారి మాఫీచేసింది. ఇందుకోసం రూ.1210 కోట్లను గురువారం ఆర్థికశాఖ విడుదలచేసింది. వ్యవసాయశాఖ నుంచి రెండుమూడు రోజుల్లో నేరుగా రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమవుతాయి. దీనివల్ల దాదాపు 5.88 లక్షల మంది రైతుల పంటరుణాలు ఒకేసారి మాఫీ అవుతాయి. రుణమాఫీ అయిన రైతులు బ్యాంకుల నుంచి కొత్త రుణాలను పొందనున్నారు. కుటుంబానికి లక్షరూపాయల వరకు పంట రుణాలను నాలుగు దఫాలుగా మాఫీచేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.25 వేల లోపు పంట రుణాలున్నవారికి ఒక దఫాలో.. మిగతా వారికి దశలవారీగా మాఫీచేస్తారు. రాష్ట్రంలో మొత్తం రుణమాఫీ లబ్ధిదారులు 40.66 లక్షల మంది ఉన్నట్లు అధికారులు అంచనావేశారు. వీరిలో 5.88 లక్షల మంది రూ.25 వేల లోపు రుణాలు తీసుకొన్నవారున్నారు. రుణమాఫీ సొమ్మును రైతులకు చెక్కుల రూపంలో అందించాలని ప్రభుత్వం ముందుగా భావించింది. కానీ.. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకే డబ్బులను నేరుగా బదిలీచేయాలని నిర్ణయించింది. 

రైతుబంధుకు రూ.7వేల కోట్లు

మరోపక్క వానకాలం సీజన్‌కు రైతుబంధు నిధులను కూడా ప్రభుత్వం గురువారం విడుదలచేసింది. ఇందుకోసం ఆర్థికశాఖ రూ.7,000 కోట్లు మంజూరుచేసింది. ఈ నిధులను వ్యవసాయశాఖకు కేటాయించారు. జనవరి 31 వరకు రైతుబంధు పోర్టల్‌లో వివరాలు నమోదైన రైతులను లబ్ధిదారులుగా గుర్తించి, ఎకరానికి రూ.5 వేల చొప్పున వానకాలం రైతుబంధు డబ్బులు చెల్లిస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపట్ల రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 

సమన్వయంతో పనిచేస్తాం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రూ.25 వేల రుణాల మాఫీ కోసం రూ.1210 కోట్లు, రైతుబంధు సాయంకింద రూ.7 వేల కోట్లు విడుదలచేసినట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. గురువారం అరణ్యభవన్‌లో ఆర్థిక, వ్యవసాయశాఖ అధికారులతో ఇద్దరు మంత్రులు సంయుక్త సమీక్షాసమావేశం నిర్వహించారు. రుణమొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమచేసేందుకు అన్ని చర్యలు తీసుకొన్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత క్యాబినెట్‌లో నిర్ణయించిన ప్రకారం రైతుబంధు సాయాన్ని పంట సీజన్‌ ఆరంభమయ్యేనాటికి రైతులకు అందించాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది కోటి 40 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు చెల్లించామని వివరించారు. 51 లక్షల మంది రైతులకు దీనివల్ల లబ్ధిచేకూరిందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఆర్థిక, వ్యవసాయశాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మంత్రులు సూచించారు. ఈ సమీక్షలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఆర్థిక , వ్యవసాయశాఖ  ముఖ్యఅధికారులు పాల్గొన్నారు.

రైతురుణమాఫీపై హర్షం 


 రైతు రుణమాఫీపై సీఎం కేసీఆర్‌కు పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు. లాక్‌డౌన్‌తో రెండు నెలలుగా ప్రభుత్వానికి ఆదాయం పడిపోయినా ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీలో భాగంగా మొదటివిడుతగా రూ.25 వేల లోపు రుణం కలిగిన 6.10 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగించేలా రూ.1,210 కోట్లను విడుదలచేసి మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌కు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ మారం గంగారెడ్డి వేర్వేరు ప్రకటనల్లో ధన్యవాదాలు తెలిపారు.


logo