FEE REimbursement : వృత్తివిద్యా కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్. బీఆర్ఎస్ పార్టీ పోరాటం, కాలేజీ యాజమాన్యాల ఒత్తిడితో ప్రభుత్వం దిగివచ్చింది. కొన్ని రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ (FEE Reimbursement) బకాయిలకు మోక్షం లభించనుంది. భారీగా పెరిగిపోయిన బకాయిల విడుదలపై సోమవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కాలేజీ యాజమన్యాలతో చర్చలు జరిపారు. అనంరం.. దీపావళి లోపు రూ.1,200 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే.. ఒకేసారిగా కాకుండా రెండు దశలుగా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
ఇప్పటికే టోకెన్లు ఇచ్చిన రూ.600 కోట్లు వారంలో విడుదల చేస్తామని ఉపముఖ్యమంత్రి భట్టీ అభయమిచ్చారు. మరో రూ.600 కోట్ల బకాయిలను దీపావళి లోపు మంజూరుకు చేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావడంతో రేపటి నుంచి చేపట్టదలచిన తరగతులు బంద్‌ను వృత్తివిద్యా కాలేజీలు ఉపసంహరించుకున్నాయి. దాంతో.. యాజమాన్యాలకు డిప్యూటీ సీఎం భట్టి ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాదు ఫీజు రీయింబర్స్మెంట్ రేషనలైజేషన్ కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించినట్టు భట్టి వెల్లడించారు.