హైదరాబాద్ : రాష్ట్రంలోని డిస్కంలలో మొత్తం ఏడుగురు డైరెక్టర్లను తాత్కాలికంగా నియమించారు. పూర్తిస్థాయి డైరెక్టర్లను నియమించి, వారు బాధ్యతలు స్వీకరించేంత వరకు ప్రస్తుతం నియమించిన తాత్కాలిక డైరెక్టర్లు సంస్థల కార్యలాపాలను నిర్వహిస్తారని రెండు డిస్కంల సీఎండీలు మంగళవారం జారీచేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)లో సీజీఎంగా ఉన్న కె.రాములును డైరెక్టర్ కమర్షియల్, ఐపీసీ అండ్ ఆర్ఏసీగా నియమించారు. ప్రాజెక్ట్స్ సీజీఎం కె.నందకుమార్‌ను డైరెక్టర్ (ప్రాజెక్ట్స్, ఐటీ, ఈఏ, డీపీఈ అండ్ అసెస్మెంట్స్)గా, సీజీఎంగా ఉన్న ఎన్.నర్సింహులును డైరెక్టర్ (ఆపరేషన్స్, పీ అండ్ ఎంఎం)గా, సీజీఎం కె.సుధామాధురిని డైరెక్టర్ (ఫైనాన్స్, హెచ్ఆర్ అండ్ ఐఆర్)గా నియమిస్తూ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే ఉత్తర ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్)లో సీజీఎంగా ఉన్న టి.సదర్‌లాల్‌ను డైరెక్టర్ (ప్రాజెక్ట్స్)గా, సీజీఎం వి.మోహన్‌రావును డైరెక్టర్ (ఆపరేషన్స్)గా, సీజీఎం బి.అశోక్‌కుమార్‌ను డైరెక్టర్ (హెచ్ఆర్డీ అండ్ ఐఆర్)గా నియమిస్తూ ఎస్పీడీసీఎల్ సీఎండీ కె.వరుణ్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. పూర్తిస్థాయి డైరెక్టర్లను నియమించే వరకు ప్రస్తుతం నియమించిన తాత్కాలిక డైరెక్టర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.