యాదాద్రి భువనగిరి, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పక్కాగా గెలుస్తుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో మంగళవారం నిర్వహించిన సీపీఐ సభలో ప్రసంగించారు. మునుగోడు నియోజక వర్గంలో బీజేపీకి కనీస ఓటు బ్యాంకు లేదని, రాజకీయ లబ్ధికోసమే ఆ పార్టీ పోటీ చేస్తున్నదని పేర్కొన్నారు. మునుగోడులో గెలిస్తే రాష్ట్రంలో గెలుపొందవచ్చనే రాజకీయ దురాశతో ఉన్నదని, అందుకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని వినియోగించుకొంటుందని విమర్శించారు. రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టులను కాపాడుకోవడానికే బీజేపీలో చేరాడని ఆరోపించారు. ఎన్ని ఎత్తులేసినా మొదటి స్థానం టీఆర్ఎస్కే దక్కుతుందని, కాంగ్రెస్ రెండో, బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకొంటాయని జోస్యం చెప్పారు. మునుగోడులో తమకు 25 వేలకుపైగా ఓటు బ్యాంకు ఉన్నదని, వచ్చే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకేనని స్పష్టం చేశారు. బీజేపీ ఎన్ని డబ్బులు పంచినా, ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో గెలువడం కష్టమన్నారు.