హైదరాబాద్, అక్టోబర్19 (నమస్తే తెలంగాణ): గొర్రెల పంపిణీ పథకం నిధులను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి అడ్డుకొన్నారని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గొల్ల, కురుమలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే తమ ఖాతాల్లో జమ అయిన డబ్బులను డ్రా చేసుకొని, గొర్రెలు కొనుగోలు చేసుకోవచ్చునని స్పష్టం చేశారు. బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో గొల్ల, కురుమ ప్రజా ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో గొల్ల కురుమలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకం ప్రవేశపెట్టారని చెప్పారు. ఇదో అద్భుతమైన పథకమని, తెలంగాణలో అద్భుతమైన ఫలితాలు సాధించిందని తెలిపారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్పర్ కింద రెండవ విడత గొర్రెల పంపిణీ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలను ఎంపిక చేశామని, బీజేపీ నేతలు ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి నిలుపుదల చేయించారని మండిపడ్డారు. ఈ పథకాన్ని అడ్డుకోవడం ద్వారా తామేదో విజయం సాధించినట్టు బీజేపీ నేతలు పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత వరకు ఈ పథకాన్ని ఆపగలరు కానీ నవంబర్ 6 తర్వాత ఆపలేరని చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు
బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి అద్భుతమైన మెజారిటీ సాధిస్తారని తలసాని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్ కుళ్లు, కుతంత్రాలతో గెలవాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు మునుగోడులో తాము గెలిస్తే రూ.3 వేలు పెన్షన్ ఇస్తామని చెప్తున్నారని, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కూడా ఇదే విధంగా హామీలు ఇచ్చి అమలు చేయలేదని గుర్తుచేశారు. దుబ్బాక, హుజారాబాద్‌లో ఉప ఎన్నికలు పూర్తయ్యి ఏడాది గడిచిపోయినా ఇప్పటికీ ఇంకా ఒక రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఒక్క పైసా నిధులు తేలేని బీజేపీ నేతలు ఫిర్యాదులతో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అడ్డుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజగోపాల్‌రెడ్డి రూ.18 వేల కాంట్రాక్ట్ కోసం ఉప ఎన్నిక తెచ్చారని, మనుగోడు ప్రజలకు మంచి చేసేందుకు కాదని పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డి రూ.3వేల పెన్షన్ ఎలా తెస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఓట్ల కోసం బీజేపీ నేతలు ఏది పడితే అది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. డబుల్బెడ్రూం లాంటి పథకం దేశంలో ఎక్కడైనా ఉన్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. కేంద్రంలో 8 ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సిటీలో ఉపఎన్నిక వస్తుందన్న వార్తలు అవాస్తవమని, ఇలాంటి గాలి వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, గొర్రెల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.