నమస్తే తెలంగాణ, నెట్వర్క్, అక్టోబర్ 27: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన బీజేపీ, ప్రధాని మోదీపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ, నరేంద్రమోదీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాల శవయాత్రలు నిర్వహించారు. ప్రధాన రహదారులపై రాస్తారోకోలు చేశారు. వికారాబాద్‌లో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఐ యామ్ తెలంగాణ, ఐ యామ్ నాట్ ఫర్ సేల్ అంటూ ప్లకార్డులు పట్టుకుని మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. యూసుఫ్‌గూడ కూడలిలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ముషీరాబాద్‌లో ఎమ్మెల్యే ముఠా గోపాల్.. మోదీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని అన్ని గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి.
మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. ఆసిఫాబాద్‌లోని అంబేద్కర్ చౌక్ సమీపంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప, జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆధ్వర్యంలో, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం, బీజేపీకి వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. భూపాలపల్లి జిలా ్లకేంద్రంలో వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, రేగొండ మండలం కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రాస్తారోకో నిర్వహించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గులాబీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. గురువారం జిల్లా కేంద్రాలతో పాటు అన్ని మండలాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పాలమూరు జిల్లాలో కూడా బీజేపీపై ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు బీజేపీకి వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీజేపీపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్ గ్రామంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో, పొర్లగడ్డ తండాలో మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. చౌటుప్పల్ పట్టణంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నల్ల చొక్కా ధరించి నిరసన వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మండలం డీ నాగారంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ముష్టిపల్లి గ్రామంలో ఎంపీ మాలోతు కవిత, చండూరులో ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు చావుడప్పు కొట్టి శవయాత్ర నిర్వహించారు.
అధికార దాహంతో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నది. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు. ఆ పార్టీ ప్రలోభాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవ్వరూ లొంగరు. బీఆర్ఎస్తో ఢిల్లీలో తమ పీఠం కదులుతుందని బీజేపీకి భయం పట్టుకున్నది. కేసీఆర్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి కుట్రలు చేస్తున్నారు. తెచ్చుకొన్న తెలంగాణను తెర్లు కానివ్వం. కొట్లాడైనా కాపాడుకుంటాం. బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు.
– ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి
ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికే అనేక రాష్ర్టాల్లో ఎమ్మెల్యేలను కొనేయడం, ప్రభుత్వాలను మార్చడం, వినకపోతే ఈడీ, సీబీఐలతో బెదిరిస్తున్న ఘటనలు చూశాం. పార్టీ మారేందుకు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వందల కోట్లు ఎర చూపడం అనైతిక చర్య. బీజేపీ నేతల మాటలను తెలంగాణ సమాజం నమ్మేస్థితిలో లేదు. ఆ పార్టీ నాయకులు తలకిందల తపస్సు చేసినా మునుగోడులో బీజేపీ గెలవదు.
-తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ర్ట కార్యదర్శి
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రలోభాలకు గురిచేయడం సిగ్గుచేటు. గతంలో పలు రాష్ర్టాల్లో బీజేపీకి మెజార్టీ లేకపోయినా ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను బెదిరించి, లొంగదీసుకొని అధికారం చేపట్టారు. ఇప్పుడు తెలంగాణలో చిచ్చుపెట్టేం దుకు కుట్రలు పన్నుతున్నది. బీజేపీ మతవాద, బ్లాక్మెయిల్ రాజకీయాలను ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలి.
-కే రామకృష్ణ, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి