హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి దళిత బంధు పథకం వర్తింపజేస్తామని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకంపై సంఘ వ్యతిరేక శక్తులు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు.
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని 4,5,6,7,10వ వార్డుల్లో పర్యటించి, దళితబంధు పథకంపై అవగాహన కల్పించారు. ఈ పథకంపై ఇతర పార్టీలు సృష్టిస్తున్న వదంతులపై దళిత కుటుంబాలతో చర్చించి వాస్తవాలను వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా మాట్లాడుతూ.. ప్రతీ దళిత కుటుంబానికి అండగా నిలిచేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు కావాలని దళితుల్లో గందరగోళం సృష్టించి లబ్ది పొందాలనుకుంటున్నారని, ఇలాంటి కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పథకంపై బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఎమ్మెల్సీ పల్లా సూచించారు.