నల్లగొండ : ఉద్దేశపూర్వకంగానే బీజేపీ గూండాలు టీఆర్ఎస్ శ్రేణులపై దాడి చేశారని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ రాళ్లు, కర్రల దాడి గురించి మీడియాకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వివరించారు. ఉప ఎన్నిక ప్రచారం చివరి రోజు సందర్భంగా మండల కేంద్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించే రోడ్ షోకు కిష్టాపురం, ఇప్పర్తి గ్రామాల నుండి బయలుదేరి వస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు పలివెల గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే స్థానికంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రచారంలో భాగంగా స్థానిక చౌరస్తాలో మాట్లాడుతున్నారు.
ఈటల రాజేందర్, కంకణాల సురేందర్ రెడ్డి, గడ్డం సాయికుమార్ ఆధ్వర్యంలో గూండాలు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు వారి అనుచరులపై దాడి చేశారు. విషయం తెలుసుకుని అటుగా వెళ్తున్న తనపై కూడా గూండాలు మెరుపుదాడి చేశారని తెలిపారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన రెడ్డికి, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, నాతి సురేష్, భవనం శ్రీనివాస్ రెడ్డిలతో పాటు పలువురు టీఆర్ఎస్ శ్రేణులకు తీవ్ర గాయాలయ్యాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఆయన సతీమణి ఈటల జామున, కంకణాల సురేందర్ రెడ్డి, గడ్డం సాయిపై జిల్లా పోలీసులకు, బై ఎలక్షన్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని తెలిపారు.