హైదరాబాద్ : టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ఎల్పీలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యాడని ఆరోపించారు. రైతులకు కేసీఆర్ అన్ని వసతులు కల్పించి బ్రాండ్ అంబాసిడర్‌గా మారితే.. రేవంత్, బీజేపీ నేతలు బూతులకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు అని మండిపడ్డారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు రేవంత్ రెడ్డి వకాల్తా పుచ్చుకుని బీజేపీకి బంట్రోతుగా మారిపోయారు అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించేది రచ్చబండ కాదు.. తమ పతనానికి తవ్వుకుంటున్న బొంద అని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్ని అవమానాలకు గురి చేసినా కేసీఆర్ తెలంగాణను సాధించారు. ఇప్పుడు బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానిస్తోంది. అలాంటి బీజేపీకి కాంగ్రెస్ గతే పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ ,తీన్మార్ మల్లన్న లాంటి చిల్లర వ్యక్తులు కేసీఆర్ కుటుంబ సభ్యులపై చిల్లర భాష వాడుతుండడాన్ని తెలంగాణ సమాజం ముక్త కంఠంతో ఖండిస్తోంది అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. తీన్మార్ మల్లన్న జర్నలిస్టు కాదు.. బ్లాక్ లిస్టులో ఉన్న బీజేపీ నేత అని దుయ్యబట్టారు. తీన్మార్ మల్లన్న తన తీరు మార్చుకోకపోతే టీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ ఆయనను తరిమే రోజులు వస్తాయన్నారు.