
హైదరాబాద్ : కేసీఆర్ మానసపుత్రిక రైతుబంధు పథకం అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కొంతమంది పొలిటికల్ టూరిస్టులు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారు అని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర సమితిని అడుగడుగునా ఆశీర్వదిస్తున్నారు అని స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రైతుబంధు ముగ్గులు వేసి మహిళలు ఆశీర్వాదం ఇచ్చారు. రైతుబంధు పతంగులు ఎగురవేసి తమ్ముళ్లు మద్దతు తెలిపారు. వేలసంఖ్యలో రైతులు తమ ఎండ్ల బండ్ల ప్రదర్శనలు చేసి, ఊరూరా పండుగ వాతావరణం తీసుకొచ్చారు. పొలాల్లో కేసీఆర్, రైతు బంధు పేరుతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల వారికి శిరసు వంచి పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సంక్రాంతి వరకు రైతుబంధు సంబురాలు నిర్వహించాలని పిలుపునిచ్చాను.
ఉమ్మడి ఏపీలో రైతుల వెతలు ప్రధాన శీర్షికలుగా వచ్చేవి. ఇప్పుడు రైతుల ఖాతాలు పతాక శీర్షికలు అయ్యాయని కేటీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు రూపంలో 64 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 50 వేల కోట్ల పెట్టుబడి సాయం అందించాం. వ్యవసాయ చరిత్రలోనే ఇది సువర్ణ అధ్యాయం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పడక ముందు రైతుల కష్టాలు అనేకం. బోర్ల కింద పంటలతో రైతులు సతమతయ్యేవారు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, లాక్కొనిపోయే స్టాటర్లు ఆనాటి పరిస్థితి. నెర్రలుబారిన నేలలు, నోళ్లు తెరిచిన బావులు, కరెంట్ తిప్పలు, తీర్చలేని అప్పులు, కాలిపోయిన మోటార్ల కుప్పలు. పంటలు అమ్మబోతే లూటీ, విత్తనాలు, ఎరువులు కొనబోతే లాఠీ.. ఈ పరిస్థితులు నిజం కాదా? ఆనాడు రైతుల పడ్డ కష్టాలు ఇవి. రైతుకు కనీసం మద్దతు లేదు. పండించిన పంటకు మద్దతు ధర కూడా ఇవ్వలేని దుస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యల్లో ఫస్ట్, వ్వయసాయ దిగుబడుల్లో లాస్ట్. పాము కాట్లు, కరెంట్ షాక్‌లు ఉండేవి. ఇది అతిశయోక్తి కాదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
సాగునీటి వసతి లేదు. ప్రాజెక్టులకు దిక్కు లేదు. రైతులకు భరోసా లేదు. పాలకులు మారినప్పటికీ పరిస్థితులు దారుణంగా ఉండేవి. అన్నం పెట్టిన రైతుకు సున్నం పెట్టారు. రైతును కాపాడేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. తెలంగాణలో భూమికి విలువలేదు. రైతుకు గౌరవం లేదు. ఇవన్నీ సత్యాలే. పాలమూరు జిల్లా నుంచి 15 లక్షల మంది రైతు కూలీలు వలస పోయిన దుస్థితి. ఎర్రజోన్న రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర ఉంది అని కేటీఆర్ గుర్తు చేశారు.