‘కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నది. మొన్నటిదాకా వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతుల ఉసురు పోసుకొన్నది. ఇప్పుడు పండుగ పూట ఎరువుల ధరలు పెంచి దగా చేస్తున్నది. ఎవుసానికి రైతులను దూరం చేసే కుట్రకు పాల్పడుతున్నది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతు సంక్షేమ పథకాలను అమలుచేస్తుంటే, కేంద్రం మాత్రం వాళ్లను రాబందులా పీక్కుతింటున్నది. రైతు జేబుకు చిల్లు పెడుతున్నది. కేంద్ర రైతు వ్యతిరేక నిర్ణయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పిడికిలి బిగిస్తే, మరోసారి ఉద్యమ నాయకుడి అవతారం ఎత్తితే బీజేపీ తట్టుకోలేదు. ఎరువుల ధరలు తగ్గించే దాకా పోరాటం ఆగదు. బీజేపీ కార్పొరేట్ కుట్రలను రైతులు గమనించి సరైన రీతిలో బుద్ధి చెప్పాలి. రైతు హంతక బీజేపీని గద్దె దించుదాం. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడి రైతుల హక్కులు కాపాడుకుందాం’ అని మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి కేంద్రంపై విరుచుకుపడ్డారు.
హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): దేశ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ పిడికిలి బిగిస్తే, మరోసారి ఉద్యమ నాయకుడి అవతారం ఎత్తితే బీజేపీ తట్టుకోలేదని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. రైతులను శాశ్వతంగా వ్యవసాయానికి దూరం చేయాలని కేంద్రం కుట్రలు చేస్తున్నదని, ఎరువుల ధరల పెంపు అందులోభాగమేనని అన్నారు. అన్నం పెట్టే రైతన్నను కేంద్రం అడుగడుగునా ఇబ్బందుల పాలు చేస్తున్నదని తెలిపారు. గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు సీ లక్ష్మారెడ్డి, గణేశ్‌గుప్తాతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎరువుల ధరలు పెంచాలని, ఎఫ్‌సీఐ వడ్లు కొనకూడదని, విద్యుత్తు సవరణ చట్టాలు తెచ్చి రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని, రైతుల నడ్డి విరగొట్టాలని బీజేపీ అనుబంధ సంస్థ కిసాన్‌మోర్చా సలహాలిస్తున్నదా? ఆరెస్సెస్ సూచించిందా? అని మండిపడ్డారు. అన్ని రంగాల్లో పురోగమిస్తున్న తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్ర రైతాంగాన్ని బీజేపీ అనేక ఇబ్బందులకు గురిచేసిందని, మొన్నటిదాకా వడ్లు కొనకుండా అడ్డుకొని, ఇప్పుడు ఎరువుల ధరలు పెంచిందని శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకలి చావులతో అలమటించిన తెలంగాణను అన్నపూర్ణగా మలిచిన మహానాయకుడు సీఎం కేసీఆర్ అని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చావు అంచుల దాకా వెళ్లి రాష్ర్టాన్ని సాధించిన త్యాగధనుడు అని కొనియాడారు. దమ్ముంటే సీఎం కేసీఆర్‌ను టచ్ చేయాలని సవాల్ విసిరారు. కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు తెలంగాణ అద్భుతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని చెప్తుంటే, టీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక బీజేపీ నేతలు వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని మండిపడ్డారు. పచ్చటి తెలంగాణపై బీజేపీ విషం చిమ్మాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు లేఖ రాయడం మాని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చేయని ప్రధాని మోదీకి రాయాలని హితవు చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగులపై బీజేపీ మొసలి కన్నీరు కారుస్తున్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. ఉద్యోగులపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేనేలేదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని అడ్డగోలుగా అమ్ముతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు దక్కాల్సిన రిజర్వేషన్లను శాశ్వతంగా ఎత్తేస్తున్న బీజేపీ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో వైషమ్యాలు రెచ్చగొడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 317జీవోతో బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ సంసారం ఉన్న ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు.