హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): “రేషన్ షాపులో మోదీ ఫొటో పెడుతాం సరే?. మరి ఆ బియ్యం ఉడుకాలంటే మంట కావాలి. ఆ మంట పెట్టాలంటే గ్యాస్ సిలిండర్ కావాలి. అది కొనాలంటే దాని ధర రూ.1100 దాటింది. మరి సిలిండర్ సంగతేంది’ అని నెటిజన్లు సోషల్ మీడియాలో బీజేపీకి కామెంట్ల వాతలు పెడుతున్నారు. సామాన్యులకు ఊపిరాడనివ్వకుండా కేంద్రం ధరలు పెంచుతూ నడ్డీ విరుస్తున్నదని చురకలు అంటిస్తున్నారు. ‘ఓ సినిమాలో వేలాడుతున్న కోడిని చూస్తూ చికెన్ తిన్నట్టు ఊహించుకున్నట్టుగా.. రేషన్ షాపు లో మోదీ ఫొటో చూస్తూ కడుపు నింపుకోవాలా? ఆ బియ్యం వండుకోవాలంటే గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించే ప్రయత్నం చేయ రా?’ అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు.
ఒక్క రేషన్ షాపులోనే ఎందుకు.. గ్యాస్ సిలిండర్లపైన మోదీ ఫొటో పెట్టి నెటిజన్లు వినూత్నంగా నిరసన చేపట్టారు. రేషన్ షాపుల్లో మోదీ ఫొటో పెట్టాలంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో టీఆర్ఎస్ కార్యకర్తలు తమదైన శైలిలో తిప్పికొట్టారు. ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతుంటే తగ్గించాల్సిన బాధ్యత తీసుకోకుండా బీజేపీ మంత్రులు మోదీ ఫొటో పెట్టాలంటూ అధికారులను బెదిరించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని చురకలు అంటించారు. గ్యాస్ సిలిండర్లకు అతికించిన మోదీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
కొంపదీసి ‘ఫొటో’ అంటాడా ఏందీ?
ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వన్ వర్డ్ ట్రెండ్ హవా కొనసాగుతుంది. ఎవ్వరైనా ఒక్క పదంతో మాత్రమే పోస్ట్ చేయాలి. ఈ నిబంధన ప్రకారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ దేశ ప్రజల ఆకాంక్షను ఒక్క పదంలో ‘స్వేచ్ఛ’ అని పోస్ట్ చేయగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ ‘డెమోక్రసీ’ అని పోస్ట్ చేశారు. కాగా వీరి పోస్టులకు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో మన భారత ప్రధాని ఏమని పోస్ట్ పెడుతారోనని నెటిజన్లు ఆసక్తిగా గమనించారు. మరికొంత మంది నెటిజన్లు మోదీ ఏం పెడుతాడోనని ముందుగానే చర్చించి చురకలు అంటించారు. కొంపదీసి ‘ఫొటో’ అని పోస్ట్ చేయడు కదా! అని నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ దండు మోదీ ఫొటో పెట్టాలంటూ అధికారులను బెదిరిస్తున్న దరిమిలా నెటిజన్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై ఈ విధంగా వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.