హైదరాబాద్ : రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం పీర్జాదిగూడ వైకుంఠధామాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు ఎంతో శ్రమించారు. వారి సేవలను గుర్తించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ప్రభుత్వానికి ఆదాయం పడిపోయింది. ప్రపంచంలో కరోనా వల్ల నష్టపోని మనిషి లేడు. పలు వ్యవస్థలు కూడా నష్టపోయాయి. అయినప్పటికీ తెలంగాణలో కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమం ఆగలేదు. రైతులకు ఇచ్చే రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్, ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు ఆగలేదు.
మున్సిపాలిటీలకు, గ్రామపంచాయతీలకు ఇచ్చే నిధులు ఠంచన్‌గా విడుదల చేశాం. నిధుల్లో కోత లేకుండా విడుదల చేశాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సీఎం కేసీఆర్ గాడిలో పెడుతున్నారు. గతేడాది వర్షాలకు ఈ ప్రాంతాలు నీట మునిగాయి. నాడు ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాం. మీ కాలనీల్లో నుంచి మూసీలోకి వరద నీరు పోయేందుకు కాల్వలకు శంకుస్థాపన చేశాం. వచ్చే వానాకాలం నాటికి ఈ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తున్నాను.
ప్రజలకు సంబంధించి మౌలిక అవసరాలను కల్పిస్తున్నాం. కరెంట్ సమస్యను అధిగమించాం. పరిశ్రమలకు, వ్యవసాయానికి, ఇండ్లకు 24 గంటల నాణ్యమైన కరెంట్‌ను అందిస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు ఆరేడు గంటలు కరెంట్ సరఫరా ఆగిపోయేది. విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే ముందుకు పోతున్నాం. దేశంలోని అన్ని మహానగరాల్లో మంచినీటి సమస్యలు ఉన్నాయి. తెలంగాణలో కేసీఆర్ సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చేందుకు సంకల్పించారు. గత టర్మ్‌లోనే 90 శాతం ఆవాసాలకు మంచినీళ్లు ఇచ్చాం.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదు. హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల టిమ్స్ పేరిట నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. బస్తీల్లో బస్తీ దవఖానాలు రాబోతున్నాయి. ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించి ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తయారు చేస్తున్నాం. వైకుంఠధామం ఎంతో చక్కగా ఉంది. ఒకటే చోట హిందూవులకు, ముస్లింలకు, క్రైస్తవులకు ఒకటే చోట వైకుంఠధామం ఏర్పాటు చేసినందుకు పీర్జాదిగూడ కార్పొరేషన్ చైర్మన్‌తో పాటు అందరినీ అభినందిస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఫీర్జాదిగూడా మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని మేడిపల్లిలో నిర్మించిన వైకుంఠదామాన్ని మంత్రులు శ్రీ @KTRTRS, శ్రీ @chmallareddyMLA ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫీర్జాదిగూడా మేయర్ శ్రీ @VenkatReddyJkka మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. pic.twitter.com/lx3Lanbuqx
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 2, 2022