RRR | హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం భూ నిర్వాసితులకు ఎంత నష్టపరిహారం చెల్లించాలో తేలకుండానే ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం పరిహారం చెల్లించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వజూపిన పరిహారం మార్కెట్ ధరలో సగం కూడా లేకపోవడంతో రైతులు ఒప్పుకోవడంలేదు. దీంతో నష్టపరిహారం మొత్తాన్ని కోర్టులో జమచేసి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఫలితంగా ట్రిపుల్ఆర్ భూసేకరణ వ్యవహారం మరో లగచర్లలా మారవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 162 కిలోమీటర్ల పొడవైన ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం కోసం 1,950 హెక్టార్ల భూములు సేకరిస్తున్నారు. ఆ భూములతోపాటు ఇతర ఆస్తులకు సంబంధించి నిర్వాసితులకు రూ.5,100 కోట్ల నష్టపరిహారం అందజేయాల్సి ఉంటుందని అంచనా. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాల్సి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.2,550 కోట్లు చెల్లించాల్సి ఉండగా..
ఈ ఏడాది బడ్జెట్లో రూ.1,250కోట్లు కేటాయించారు. భూసేకరణ 85% మేరకు పూర్తయిందని, అవార్డులు పాస్ చేశామని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ), రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించాయి. ప్రస్తుతం నిర్ధారిత నష్ట పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమచేసేందుకు ఎన్హెచ్ఏఐ సన్నాహాలు చేస్తున్నది. అయితే, మార్కెట్ ధర ప్రకారం తొలుత ఎకరాకు రూ.6 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని నిర్ధారించడంతో రైతులు వ్యతిరేకించారు. దీంతో ప్రభుత్వం భూముల ధరలను సవరించడంతోపాటు సరైన నష్టపరిహారాన్ని నిర్ధారించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆర్బిట్రేషన్‌ను ఏర్పాటు చేసింది. ట్రిపుల్ఆర్ నిర్మించే ప్రాంతాల్లో ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు పలుకుతుండగా.. ప్రభుత్వం మాత్రం గరిష్ఠంగా రూ.12-15 లక్షల నష్ట పరిహారం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు, అవార్డు పాస్‌చేసిన భూములకు నష్టపరిహారం చెల్లించేందుకు ఎన్హెచ్ఏఐ సిద్ధమవున్నది. ఒకవేళ రైతులు నష్టపరిహారం తీసుకునేందుకు నిరాకరిస్తే ఆ సొమ్మును కోర్టులో జమచేసి మ్యుటేషన్ (అధికారికంగా భూములు తమ ఆధీనంలోకి తీసుకోవడం) చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
బహిరంగ మార్కెట్ ధర ప్రకారమే తమకు నష్టపరిహారం చెల్లించాలని ట్రిపుల్ఆర్ భూ నిర్వాసితులు కోరుతున్నారు. లేకుంటే తమ భూములను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. తమను సంప్రదించకుండానే ఎన్హెచ్ఏఐ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవార్డులు పాస్ చేశాయని, ఇప్పుడు నష్టపరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని వారు వాపోతున్నారు. దీనిపై ఇప్పటికే కొందరు రైతులు న్యాయ పోరాటానికి దిగడంతో కోర్టు స్టే విధించింది. ట్రిపుల్ఆర్ను తమ భూముల మీదుగా వెళ్లకుండా చూస్తామని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు హామీ ఇచ్చారని రాయగిరి, యాదాద్రి ప్రాంతాలకు చెందిన రైతులు గుర్తుచేస్తున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం పోలీసుల సహకారంతో బలప్రయోగం ద్వారా అయినా తమ భూములను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే లగచర్ల తరహా ఘటన పునరావృతమవుతుందని హెచ్చరిస్తున్నారు. ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి ఇదివరకే టెండర్లను ఆహ్వానించినప్పటికీ కోర్టు కేసులు తేలకపోవడంతోపాటు పర్యావరణ అనుమతుల కారణంతో వాటిని ఇంకా తెరవలేదు. అయితే, తాజాగా పర్యావరణ అనుమతులు లభించినట్టు అధికారులు తెలిపారు. కోర్టు కేసులు కూడా త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం విషయంలో రైతులు ఒప్పుకోకుంటే ఆ మొత్తాన్ని కోర్టులో జమచేసి పనులు చేపట్టే ఆస్కారముందని వారు చెప్తున్నారు.