హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): అన్నదాతలారా.. రుణమాఫీ కాలేదని ధైర్యాన్ని కోల్పోవద్దని మాజీ మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న సిద్దిపేట రైతు సురేందర్‌రెడ్డి మృతదేహం ఉన్న గాంధీ దవాఖాన మార్చురీ వద్ద శుక్రవారం నివాళులర్పించారు. రుణమాఫీ కాలేదనే మనస్తాపంతో రైతు సురేందర్‌రెడ్డి ఆత్మహత్య చేనుకోవడం బాధాకరమని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రైతుకూ రుణమాఫీ చేసేవరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. సీఎం తప్పుడు ప్రకటనలు, బుకాయింపులతో రైతులు ఆత్మైస్థెర్యం కోల్పోతున్నారని చెప్పారు.
మ్యానిఫెస్టోలో చెప్పినట్టు రైతులందరికీ రుణమాఫీ చేసే దిశగా బాధ్యతగా వ్యవహరించాల్సిందిగా సీఎంకు హితవు పలికారు. మాఫీ విషయంలో రేవంత్‌రెడ్డి నిర్దేశించుకున్న గడువు ముగిసి నెల కావస్తున్నదని, ఇప్పటికైనా కండ్లు తెరిచి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని హరీశ్‌రావు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బంగారంలాంటి తెలంగాణను అతలాకుతలం చేశారన్నాని ఎమ్మెల్యే మల్లారెడ్డి విమర్శించారు. రుణమాఫీ కాలేదని మేడ్చల్‌లో రైతు సురేందర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో రైతులంతా ఆనందంగా ఉన్నారని, నాడు దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.