మాచారెడ్డి, డిసెంబర్ 11: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బంజారాలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని, తీరు మార్చుకోకపోతే సహించేది లేదని గిరిజనులు హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండా ఎక్స్‌రోడ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఆదివారం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తమ గిరిజన సోదరుడు, విద్యుత్తు ఉద్యోగి నాయక్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ వద్ద టీ, నీళ్లు మోస్తున్నాడని అవమానపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు.
అగ్రవర్ణాలకు చెందిన రాజకీయ నాయకులు మైనారిటీలు, గిరిజనులను కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల మీద ఆధిపత్య ధోరణి మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులు నౌసి నాయక్, సదర్ నాయక్, శంకర్ నాయక్, తిరుపతి, మాన్సింగ్, రవి, ప్రకాశ్, స్వామి, సుబ్బు నాయక్, మహేశ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.