రామారెడ్డి, నవంబర్ 19: లగచర్లలో గిరిజనులు, మహిళలపై దాడి, అరెస్టును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గిరిజనులు మంగళవారం ధర్నా నిర్వహించారు. సీఎం కుటుంబసభ్యుల ఫార్మా కంపెనీ కోసం ప్రభుత్వం గిరిజన, గిరిజనేతరులకు జీవనాధారమైన భూములను లాక్కోవడం సమంజసమా? అని ప్రశ్నించారు. భూమి ఇవ్వకపోతే గిరిజనులను కొడతారా? మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారా? అని మండిపడ్డారు. గిరిజనులను అక్రమంగా అరెస్టు చేసి ప్రభుత్వం భూములను గుంజుకోవాలని చూస్తున్నదని దుయ్యబట్టారు. దళిత, గిరిజనుల భూములను లాక్కుని తన కుటుంబసభ్యులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు సంపాదించేందుకు రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.