కొత్తగూడెం అర్బన్, జూన్ 12 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలోని సర్వే నంబర్ 30, 36, 39లోగల భూములను అటవీ శాఖ నుంచి తిరిగి తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజనులు మూడు రోజులుగా పాదయాత్ర చేస్తూ గురువారం భద్రాద్రి కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
జోరు వానను సైతం లెక్క చేయకుండా కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకుడు మడకం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రామన్నగూడెంకు చెందిన దాదాపు 150 కుటుంబాలు సర్వే నంబర్ 30, 36, 39లోని భూముల్లో తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నట్టు తెలిపారు. వారికి ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలు సైతం ఇచ్చిందని, అయినా లంకలపల్లి రెవెన్యూ గ్రామ సర్వే నంబర్ ఇదేనని, ఇది అటవీ శాఖ భూమి అంటూ ఆదివాసీలను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
సదరు 573 ఎకరాల భూమి ఆదివాసీలదేనని 2011లో హైకోర్టు సైతం స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్ వారి వద్దకు చేరుకొని సమస్యను తెలుసుకున్నారు. కలెక్టర్‌కు సమస్యను వివరించి పది రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.