బయ్యారం, జూలై 10: ‘ఇందిరమ్మ ఇండ్లు మాకెందుకు ఇవ్వరు?, మేం అర్హులం కాదా?, ఓట్లు వేసేందుకు మాత్రమే పనికి వస్తామా’..? అంటూ గిరిజన మహిళలు ఎమ్మెల్యే కోరం కనకయ్యను నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపనలో భాగంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాలాజీపేటలో పర్యటించి, బాల్యతండా గ్రామానికి వెళ్తుండగా శివారులో త్రిత్రితండా, జగ్నితండా, బాలాజీపేట, చొక్లతండా ప్రజలు ఎమ్మెల్యే కాన్వాయ్‌ని అడ్డుకున్నారు.
త్రిత్రితండా మహిళలు తమ గ్రామంలో 35 ఇండ్లు ఉంటే ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదని.., మేం ఏం పాపం చేశామని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు తమకు నచ్చినవారికే ఇండ్లు ఇచ్చారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని.. మూడు విడతల్లో ప్రతి పేదవారికి ఇల్లు ఇస్తామని సర్దిచెప్పారు. అయినా మహిళలు వినకుండా వాదనకు దిగడంతో కాన్వాయి ఎక్కి వెళ్లిపోయారు.
చోక్లతండాలో ఇండ్ల శంకుస్థాపనకు వెళ్లిన ఎమ్మెల్యేకు తమకు ఇండ్లు ఇవ్వాలని పలువురు వినతిపత్రాలు అందించారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త భాస్కర్ తనను ఆదుకోవాలని ఎమ్మెల్యే కాళ్ల మీదపడి వేడుకున్నాడు. పార్టీ కోసం కృషి చేస్తున్న తాను చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్నానని, సంక్షేమ పథకాలు మంజూరు చేసి ఆదుకోవాలని కోరాడు. సింగారం గ్రామానికి చెందిన యువకుడు శంకర్ తనకు రైతు రుణమాఫీ కాలేదని, రైతుభరోసా రాలేదని.. ఇవేమీ ఇవ్వకుండా గ్రామానికి ఎందుకు వస్తున్నారని ఎమ్మెల్యేని ప్రశ్నించాడు. దీంతో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని అనంతరం వదిలేశారు.