KCR Kit | ఆదిలాబాద్, మార్చి 8(నమస్తే తెలంగాణ) : మహిళా దినోత్సవం రోజునే ఓ బాలింత రక్తహీనతతో మృతి చెందడం పలువురిని కలిచివేసింది. ఆడబిడ్డలకు సంక్షేమ పథకాలతో అండగా ఉండాల్సిన ప్రభుత్వమే వాటిని నిలిపివేసి వారి పాలిట శాపంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన న్యూట్రిషన్ కిట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడంతో పౌష్టికాహారం అందక కూలీ పనులు చేసుకునే ఓ పేదింటి ఆడబిడ్డ రక్తహీనతతో కన్నుమూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని లక్కారంలో కూలీ పనులు చేసుకుంటూ ఉపాధి పొందే గర్భిణి అత్రం శ్రీ విద్య(23) పౌష్టికాహార లోపం ఫలితంగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నది. 40 రోజుల కిందట ప్రసవం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌లో చేరింది. ప్రసవ సమయంలో దవాఖానలో రక్తం ఎక్కించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. రక్తహీనత కారణంగా తీవ్ర అనారోగ్యం బారిన పడిన శ్రీవిద్య మహిళా దినోత్సవం రోజైన శనివారం ఉదయం మరణించింది. దీంతో 40 రోజుల శిశువు అనాథగా మారిందని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
గర్భిణులకు పౌష్టికాహారం అందించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేసింది. ఈ కిట్‌లో కిలో న్యూట్రిషన్ మిల్క్ పౌడర్, కిలో ఖర్జూర పండ్లు, మూడు బాటిళ్ల ఐరన్ సిరప్‌తోపాటు, అర కిలో నెయ్యి ఉంటాయి. ఈ కిట్లను రెండు విడతలుగా అందించింది. దీంతో గర్భిణుల్లో హిమోగ్లోబిన్ శాతం పెరగడంతోపాటు రక్తహీనత సమస్యకు పరిష్కారం లభించింది.
ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మాతా, శిశు మరణాల రేటు తగ్గించడానికి ఈ కిట్ ఎంతగానో ఉపయోగపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ పథకాన్ని నిలిచి వేసింది. దీంతో గర్భిణులకు 14 నెలలుగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందకపోవడంతో పోషకాహారం లభించడం లేదు. ప్రస్తుతం ఈ పథకం నిలిచిపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయి.