హాస్టల్లో దీపావళి రోజు మా బిడ్డకు వాంతులు అయినయ్. ఈ విషయం మాకు రెండు రోజుల దాకా ఎవరూ చెప్పలే. దవాఖానకు తీసుకపోయేటప్పుడు సీరియస్‌గా ఉందని చెప్పిన్రు. నిమ్స్‌లో చేర్పించి 20 రోజులైతాంది. బిడ్డ ఆరోగ్యం గురించి డాక్టర్లు, అధికారులు ఎవ్వరూ స్పష్టత ఇవ్వలేదు. డాక్టర్లను అడిగినప్పుడల్లా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నరు. గ్యారెంటీ ఇవ్వలేమన్నరు. మా బిడ్డ చనిపోయే దాకా మాకు ఏదీ సరిగా చెప్పలే. మంచిగ చదువుకొని మమ్ముల చూసుకుంటదని ఎంతో ఆశపడ్డం. మా పాప చావుకు అధికారులే కారణం.
Shailaja | ఖైరతాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఉన్నత చదువులు చదివి పుట్టిన ఊరుకు మంచి పేరు తెచ్చి, తల్లిదండ్రులకు ఆసరాగా నిలువాల్సిన ఆ బిడ్డ భవిత ముగిసిపోయింది. 27 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన విద్యార్థిని శైలజ కలలను కండ్లలోనే దాచుకుని కండ్లుమూసింది& కానరాని లోకాలకు వెళ్లిపోయింది. కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతతో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడిన విద్యార్థిని శైలజ(14) మృతి చెందింది. హైదరాబాద్ నిమ్స్‌లో 23 రోజుల పాటు చికిత్స పొందిన శైలజ పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించారు. కానీ సోమవారం శైలజ తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు స్పష్టంచేశారు. అక్టోబర్ 30న వాంకిడి గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 64 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతతకు గురైన విద్యార్థినులు ఇ మహాలక్ష్మి, కే జ్యోతి, సీ శైలజను ఈ నెల 5న నిమ్స్ దవాఖానలో చేర్చారు. ఇద్దరు విద్యార్థ్ధినులు కోలుకోగా 14న డిశ్చార్జి అయ్యారు. శైలజ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూ వచ్చింది. కల్తీ ఆహారం ఆమె ఊపిరితిత్తులు, మూత్రపిండాలపై ప్రభావం చూపింది. ఈ నెల 5న ఐసీయూకు తరలించారు. పరిస్థితి మరింత విషమించడంతో ఆర్‌ఐసీయులో చికిత్సను అందించారు. కానీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. శైలజ సోమవారం తుదిశ్వాస విడిచింది.
ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో మృతదేహాన్ని నిమ్స్ వైద్యులు గుట్టుచప్పుడు కాకుండా పోలీసు బందో బస్తుతో పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖాన మార్చురీకి తరలించారు. ఈస్ట్ జోన్ పరిధిలోని చిలకలగూడ ఏసీపీ జైపాల్‌రెడ్డి పర్యవేక్షణలో ముందస్తుగా గాంధీ దవాఖాన మెయిన్ గేటు, మార్చురీ గేటు వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలిక మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి పోలీసు బందోబస్తు నడుమ రాత్రి ఏడు గంటలకు బాలిక మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.
బాలిక మృతి చెందడంతో దవాఖానలో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ విగతజీవిగా మారడం చూసిన కన్నవారు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. బంగారు భవిష్యత్ కోసం బిడ్డను ఆశ్రమ పాఠశాలలో చేర్పిస్తే ఇప్పుడు ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదని విలపించారు. శైలజ స్వగ్రామం కుమ్రంభీం అసిఫాబాదబాద్ జిల్లా వాంకిడి మండలం దాబా గ్రామం. తల్లిదండ్రులు చౌదరి తుకారాం, మీరాబాయి వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు. శైలజ వాంకిడిలోని ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదివేది. కుమారుడు వాంకిడి జడ్పీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.
హాస్టల్లో దీపావళి రోజు మా బిడ్డకు వాంతులు అయినయ్. ఈ విషయం మాకు రెండు రోజుల దాకా ఎవరూ చెప్పలే. దవాఖానకు తీసుకపోయేటప్పుడు సీరియస్‌గా ఉందని చెప్పిన్రు. నిమ్స్‌లో చేర్పించి 20 రోజులైతాంది. బిడ్డ ఆరోగ్యం గురించి డాక్టర్లు, అధికారులు ఎవ్వరూ స్పష్టత ఇవ్వలేదు. డాక్టర్లను అడిగినప్పుడల్లా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నరు. గ్యారెంటీ ఇవ్వలేమన్నరు. మా బిడ్డ చనిపోయే దాకా మాకు ఏదీ సరిగా చెప్పలే. మంచిగ చదువుకొని మమ్ముల చూసుకుంటదని ఎంతో ఆశపడ్డం. మా పాప చావుకు అధికారులే కారణం.
మేన కోడలు శైలజ చదువులో చురుకుగా ఉండేది. శైలజ తండ్రి తుకారాం తనకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివిస్తున్నాడు. శైలజ ఉన్నత చదువులు చదువుకొని మంచి స్థాయికి వెళ్తుందని ఎంతో ఆశపడ్డారు. ఆమె చనిపోతుందని అస్సలు అనుకోలేదు.
మా తమ్ముడి కూతురు శైలజ ప్రాణాలతోనే తిరిగి వస్తుందనుకొని ఎంతో ఆశ పడ్డం. హైదరాబాద్‌లోని పెద్ద దవాఖానలో చేర్పించిన్రు అన్నరు. ఏం కాదనుకున్నం. కానీ చివరికి మా బిడ్డ శవాన్ని అప్పగిస్తరనుకోలేదు. బిడ్డ చావుకు అధికారులే బాధ్యత వహించాలి. మా ఇంటికి పెద్దదైన శైలజపై మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. చివరికి మరణవార్త వినాల్సి వచ్చింది.
ఎంత మంది బిడ్డలు మరణిస్తే నీ గుండె కరుగుతుంది? పెద్ద చదువులు చదివేందుకు గురుకులాల్లో చేరిస్తే మరో పేద గిరిజన బిడ్డను బలి తీసుకుంటివి. 20 రోజులుగా నిమ్స్‌లో ఉంటే కనీసం ఒకరోజైనా పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించలేదు. గురుకులాల్లో భద్రంగా ఉండాల్సిన అమాయక విద్యార్థులు రేవంత్‌రెడ్డి పనితీరు వలన నెలకు ముగ్గురు చొప్పున నేలరాలిపోతున్నారు. ముఖ్యమంత్రిగా నీకు పేదల పిల్లల బాధలు పట్టవాయే. విద్యాశాఖ మంత్రి లేక విద్యార్థులకు తిప్పలు తప్పవాయే. ఎంతమంది తల్లిదండ్రుల కడుపుకోతకు కారణం అవుతావు? ఎంతమంది బిడ్డలు మరణిస్తే నీ గుండెకరుగుతుంది రేవంత్?
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం అభం శుభం తెలియని గిరిజన బిడ్డకు శాపంగా మారింది. రేవంత్‌రెడ్డి దుర్మార్గపు పాలనకు వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ బలైపోయింది. తోటి విద్యార్థులతో ఆడుతూ పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన చిన్నారి విహారం తిని కన్నుమూయడం కలిచివేసింది. 25 రోజులుగా నువ్వు వెంటిలేటర్‌పై అనుభవించిన నరకానికి ప్రభుత్వమే జవాబుదారీ. నీ ప్రాణాలు బలి తీసుకున్న పాపం ఈ దుర్మార్గపు కాంగ్రెస్‌ను వెంటాడుతుంది. అడుగడుగునా సర్కారు నిర్లక్ష్యం, అధికారుల అలసత్వమే విద్యార్థిని ప్రాణాల మీదకు తెచ్చింది. విద్యార్థిని తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. సీఎం రేవంత్‌రెడ్డి నిరుపేద గిరిజన తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చారు. చివరకు ఆ అమ్మాయి చావును కూడా దాచిపెట్టాలని దొంగచాటున మృతదేహాన్ని తరలించడం సిగ్గుచేటు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. 50లక్షల పరిహారం చెల్లించాలి.
గిరిజన విద్యార్థిని శైలజ మరణం రేవంత్ సర్కార్ హత్యే. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహా రం తిని అస్వస్థతకు చికిత్స పొందు తూ మృతి చెందటం బాధాకరం. విద్యా, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి ఏనాడూ సమీ క్ష చేయలేదు. రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం ఖరీ దు 43 మంది విద్యార్థుల ప్రాణాలు. ఎంతో భవిష్యత్తు కలిగిన విద్యార్థులు అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోతుంటే, వారిని కాపాడాల్సిన ప్రభుత్వం చోద్యం చూడడం శోచనీయం.
శైలజది ముమ్మాటికి సర్కారు హత్యే. కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరమంత ఎదిగిన గురుకులాల ప్రతిష్ట ను కాంగ్రెస్ ఏడాది పాలనలో భ్రష్టు పట్టించింది. రాష్ట్రంలో నిత్యం ఏదోఒకచోటా ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగుచూస్తున్నా సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదు.
కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిరుపేద బిడ్డ ప్రాణం బలైపోయింది. రేవం త్ సర్కారు నిర్వాకం ఓ కన్నతల్లికి కడుపుకోతను మిగిల్చింది. కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురై 20 రోజులుగా దవాఖానలో చికిత్స పొందిన బాలిక శైలజ మరణవార్త ఎంతగానో కలిచివేసింది. ఆ నాడు తెలంగాణ కోసం వందలాది మంది బిడ్డల ప్రాణాలు బలిగొన్న కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 11 నెలల పాలనలో సంక్షేమ పాఠశాలల్లో కనీసం బుక్కెడు బువ్వ పెట్టకుండా 43 మంది విద్యార్థుల ప్రాణాలు తీసింది. విద్యార్థుల మరణాలు రేవంత్ సర్కారు హత్యలే.
విద్యార్థిని శైలజ మృతికి ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలి. రేవంత్‌రెడ్డి ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లను నిర్లక్ష్యం చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను చదువులకు దూరం చేయాలని చూస్తున్నారు. శైలజ మృతిపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి.
గిరిజన విద్యార్థిని శైలజకు ప్రభు త్వం మెరుగైన చికిత్స అందించకపోవడంతోనే మృత్యువాత పడింది. రేవంత్ 11 నెలల పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఉన్నతస్థాయికి ఎదిగి నిరుపేద కుటుంబానికి అండగా నిలవాల్సిన విద్యార్థిని విగత జీవిగా మారడం బాధాకరం. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ నిర్మించిన గురుకులాలను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నది.