Mahabubabad | మహబూబాబాద్ రూరల్, నవంబర్ 25: ‘ఇదేం పాలన సారూ? రైతుబంధు లేదు, బోనస్ లేదు.. ఒక్క హామీ అమలైతలేదు.. ఆరు గ్యారెంటీలు ఇచ్చేదాకా కాంగ్రెస్‌తో కొట్లాడుండ్రి’ అని కేటీఆర్‌తో గిరిజన రైతులు ఆవేదన వెలిబుచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న అనంతరం కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తొర్రూరు రోడ్డులో హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యలో మండల పరిధిలోని అమనగల్ శివారు బలరాంతండా వద్ద రోడ్డు వెంట ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కేటీఆర్ తన కారు ఆపి గిరిజన రైతుల వద్దకు వెళ్లారు. ఆయనకు కొనుగోలు కేంద్రం వద్ద రైతులు సాదరస్వాగతం పలికారు. బలరాంతండాకు చెందిన ఇస్లావత్ బిచ్చా, బీ హేమలతతో కేటీఆర్ ఆప్యాయంగా ముచ్చటించారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉన్నది? ఆరు గ్యారెంటీలు అమలవుతున్నాయా?, వడ్ల బోనస్ వచ్చిందా? అని ఆరా తీశారు. దీంతో రైతులు స్పందిస్తూ ‘ఇదెక్కడి పాలన సార్.. ఇంత వరకు రైతులకు బోనస్ డబ్బులు రాలే.. సీజన్ ప్రారంభంలోనే కేసీఆర్ రైతుబంధు వేసిండు.. ఇంతవరకు రైతుబంధు రాకపాయె.. మహిళలకు ఉపాధి, భద్రత లేదు.. తులం బంగారం లేదు.. ఒక్క హామీ కూడా అమలు కావట్లే’ అని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హామీలు అమలు చేసే దాకా దళితులు, గిరిజనులు, రైతులు, ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కేటీఆర్ వారికి ధైర్యం చెప్పారు.
ఇట్లయితదనుకోలే
కాంగ్రెస్ పార్టీ వస్తే రైతులకు మేలు చేస్తదనుకున్నం. ఇట్లయితదనుకోలే. ఈ ప్రభుత్వం వచ్చినంక రైతులే కాదు, అందరూ నష్టపోయిండ్రు. అన్ని సన్న వడ్లే వెయ్యిమని చెప్తే వేసినం. వాటికి కూడా బోనస్ వస్తలేదు. కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి గిరిజనులను ఇబ్బంది పెడుతున్నది. లగచర్ల గిరిజన రైతులపై దాడులు చేసి బెదిరించడం మంచి పద్ధతికాదు. అక్కడ నాయకులు గూండాల లెక్క రైతులను కొడుతున్నరు. రైతులపై ఇట్ల దౌర్జన్యం చేయడం దారుణం.
– ధర్మారపు రాములు, రైతు
రైతులను రేవంత్ మోసం చేసిండు
ఎక్కడలేని హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయకుండా రైతులను రేవంత్‌రెడ్డి మోసం చేసిండు. ఒక్కసారే రెండు లక్షల రుణ మాఫీ చేస్తనని చెప్పి అనేక కొర్రీలు పెట్టిండు. కుటుంబంలో ముగ్గురం బ్యాంకు రుణాలు తీసుకుంటే ఒక్కరికే మాఫీ అయింది. శాన మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతాండ్రు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని సమస్యలే వస్తున్నయి. రైతుల బాధలు పట్టించుకునేటోళ్లే లేరు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిండ్రు. వడ్లు మాత్రం ఇంకా కొంటలేరు.
-తక్కల వీరయ్య, రైతు