వికారాబాద్, ఫిబ్రవరి 13, (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొండంగల్ నియోజకవర్గం పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకోసం రైతులను అధికారులు బెదిరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూములివ్వకుంటే కోర్టు ద్వారా ప్రభుత్వమే లాక్కుంటుందని భయాందోళనకు గురి చేస్తున్నట్టు స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకోసం అసైన్డ్ భూముల సేకరణలో భాగంగా గురువారం వివిధ గ్రామాల పరిధిలోని రైతులతో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ సమావేశమయ్యారు. లగచర్ల గ్రామ పరిధిలో (రోటిబండతండా, పులిచర్లకుంట తండాలు) 102, 117, 120, 121 సర్వే నంబర్లలో కలిపి 110 ఎకరాలు ఉన్నది.
ఈ సమావేశానికి రోటిబండతండా, పులిచర్లకుంట తండాల పరిధిలోని 117, 120, 121 సర్వే నంబర్లకు సంబంధించి గిరిజన రైతులు హాజరవ్వనేలేదు. ప్రాణం పోయినా భూములివ్వబోమంటూ ఆయా తండాలకు చెందిన రైతులు అధికారులకు ఇప్పటికే తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోనే సమావేశానికి ఆ గ్రామాల రైతులు హాజరవలేదని సమాచారం. కాగా, లగచర్లకు చెందిన కొందరు రైతులు హాజరై, భూములిచ్చేందుకు సమ్మతించినట్టు అధికారులు వెల్లడించారు. 102 సర్వే నంబర్లో 77 మంది రైతులుండగా 36 మంది రైతులు భూములిచ్చేందుకు ఒప్పుకున్నట్టు అధికారులు తెలిపారు. భూములిచ్చేందుకు ముందుకు రాకుంటే, కోర్టు ద్వారా రైతులకు రూ. 6.50 లక్షలు అందజేసి భూములను తీసుకుంటామని అధికారులు బెదిరిస్తున్నట్టు గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీఎం సొంత నియోజకవర్గంలో పరిశ్రమలను నెలకొల్పేందుకు జిల్లా యంత్రాంగం ఆపసోపాలు పడుతున్నది. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలోని లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాల పరిధిలో మొదట ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఫార్మా కంపెనీ పెడితే మా బతుకులు ఆగమవుతాయని, ఎట్టిపరిస్థితుల్లో భూమిలిచ్చేది లేదని సంబంధిత గ్రామాల రైతులు తెగేసి చెప్పారు. తదనంతరం భూములివ్వకుంటే లాక్కుంటామని స్థానిక కాంగ్రెస్ నేతలు రైతులపై దౌర్జన్యానికి దిగారు. భూములు బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నించగా, అధికారులపై లగచర్ల రైతులు తిరగబడ్డారు. దీంతో అక్రమ కేసులు పెట్టి రైతులను జైలుకు పంపించారు. లగచర్ల ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. దీంతో ఫార్మా ఇండస్ట్రియల్ పార్కుకు బదులు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు పేరిట మరోసారి ప్రభుత్వం భూములను సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయినప్పటికీ గిరిజన రైతులు మాత్రం భూములిచ్చేది లేదంటూ తెగేసి చెప్తున్నారు. దుద్యాల మండలంలోని లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాల పరిధిలో 1176 భూములను సేకరించేందుకు నిర్ణయించగా, వీటిలో 533 ఎకరాలు అసైన్డ్ భూములుగా గుర్తించారు. మరో 643 ఎకరాల పట్టా భూములను సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.