ఆదిలాబాద్, ఫిబ్రవరి 26(నమస్తే తెలంగాణ): ఎండాకాలం ప్రారంభానికి ముందే ఆదిలాబాద్ జిల్లాలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా గిరిజన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. నార్నూర్ మండలంలోని బొజ్జు కొలాంగూడలో కొన్ని రోజులుగా స్థానికులు తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. పంట పొలాల మధ్యలో నుంచి కిలోమీటరుకు పైగా నడుచుకుంటూ వెళ్లి ఒర్రె నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.
ఈ ఆదివాసీ గూడలో ఉట్నూర్ ఐటీడీఏ బోరు వేయించినా.. కరెంటు సరఫరా లేక తాగునీటి సమస్య తీరడం లేదు. కలుషిత జలాలు తాగడం వల్ల అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని, తమ సమయమంతా నీరు తెచ్చుకోవడానికే సరిపోతున్నదని, వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా ఫలితం లేదని వాపోతున్నారు.