హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ): అక్కడ విగ్రహారాధన, పూజలు ఉండవు.. ఎలాంటి ధూపదీపాల సందడి కనిపించదు.. ప్రకృతితో మమేకమై వందల ఏండ్లుగా ఆదివాసీ ఆచార, సంప్రదాయాలకు ప్రతిరూపం.. రెండేండ్లకోసారి కీకారణ్యం నుంచి జనారణ్యంలోకి తల్లులు తరలివచ్చే అరుదైన సందర్భం.. కేవలం వెదురు బొంగుల నడుమ నెమలినారచెట్టు నీడలో కుంకుమభరిణెలను అమ్మలుగా భావించి మొక్కుబడులు తీర్చే అపురూప సంబురం..
ములుగు జిల్లాలో నెలవైన మేడారం జాతర దగ్గర పడుతున్నది. ప్రస్తుతం మేడారం గతంలా లేదు. పూర్తిగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆధునికీకరణ పనులు జాతర రూపురేఖల్నే మార్చేశాయి. గ్రానైట్ శిలలతో, కాంక్రీట్ మయమై, తిరునామాల చిహ్నాలతో ఆధునిక దేవాలయాన్ని తలపిస్తున్నది.
ఆదివాసీ ఆచార, సంప్రదాయాలు రానురాను చెరిపేస్తున్నది. వారి గుర్తులను రాతి స్తంభాలపై చెక్కి శాశ్వతంగా కోట్లాది మంది భక్తుల ప్రకృతి విశ్వాసాన్ని శిల్పంగా మార్చి సహజత్వాన్ని కోల్పోయేలా చేస్తున్నది. మేడారంలో గద్దెల ఆధునికీకరణ కొత్త పోకడలు పోతున్నది. ఆదివాసీ సంప్రదాయాలకు విరుద్ధంగా బ్రాహ్మణీయ భావజాలం మేడారం గద్దెలపై ఆవిష్కృతమవుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం జాతరను రూపుదిద్దుతున్నామని చెప్తున్న ప్రభుత్వ పెద్దలు.. మేడారం ఆదివాసీ జాతరలో వారి గొట్లు గోత్రాల చిహ్నాల పేరుతో తిరునామాలు, శివలింగం చెక్కడం తమ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నదని ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు.
ప్రకృతి దైవాలుగా భావించి సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గొట్లు, గోత్రాల ప్రకారం పనులు చేస్తున్నామని మంత్రి సీతక్క ప్రకటించారు. కానీ, ఆదివాసీ గొట్లు గోత్రాల్లో ఎక్కడా తిరునామాలు, నామాలు లేవని పాతతరం ఆదివాసీలు చెప్తున్నారు. బుధవారం మేడారంలో పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల ప్రతిష్టాపన జరిగింది. అప్పటివరకు ఆదివాసీ సంప్రదాయాలు, వారి మూలాలను ప్రతిబింబించే చిహ్నాలను మాత్రమే స్తంభాలపై చెక్కినట్లు చెప్పారు. తీరా ఇద్దరు దేవతలను సమ్మక్క, సారలమ్మల వరుసలోనే ప్రతిష్టించిన తర్వాత చూస్తే ఆ స్తంభాల వద్ద పగిడిద్దరాజు వద్ద తిరునామం, గోవిందరాజుల వద్ద తిరునామం, శంఖు చెక్కి కనిపించాయి.
ఇవి చూసిన వెంటనే కొందరు ఆదివాసీలు అసలు ఇవి తమ మూలాల్లో ఉండవని చర్చించుకుంటున్నారు. కానీ, గోవిందరాజులు అంటే తిరుపతిలో ఉన్న గోవిందరాజు స్వామితో సమానమంటూ అక్కడ ఉన్న ఆర్కిటెక్ట్ ఒకరు చెప్పడంతో వారు మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రతిష్టాపన విధానం ఆడంబరంగా జరగడంతో అక్కడున్నవారు ఈ చిహ్నాలను వ్యతిరేకించలేక, మంత్రి సీతక్కతో గొడవెందుకంటూ మాట్లాడకుండా ఊరుకున్నారు. ఇప్పటికే స్వస్తిక్ విషయంలోనూ వివాదం తలెత్తగా సీతక్క ఆ చిహ్నాన్ని సమర్థిస్తూ సర్దిచెప్పారు.
ఇప్పుడు ఈ తిరునామాలకు కూడా ఏదో ఒక భాష్యం చెబుతారని ఆదివాసీలు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. వనదేవతల పూజల్లో వెదురు బొంగులకు ప్రత్యేకస్థానం ఉంటుంది. సమ్మక్క జాతరకు ముందే గద్దెలపై వెదురుబొంగులతో చేసే కార్యక్రమాలు పూర్తిగా వారి ఆచార, వ్యవహారాలను ప్రతిబింబిస్తాయి. ప్రస్తుతం రాతికట్టడాల నడుమ వెదురుబొంగులు ప్రతిష్టించి వాటి దగ్గర దేవతలను ప్రతిష్టించడానికి సన్నాహాలు చేస్తున్నా.. ఇది పూర్తిగా ఒక ఆలయ రూపురేఖలను పోలి ఉన్నదని, గతంలో చెట్టు నీడలో గద్దెలపైకి ఎక్కే క్రమంలో అడుగడుగునా ప్రకృతితో మమేకమైనట్లు అనిపించేదని, ఇప్పుడు ఈ సన్నాహాలు చూస్తుంటే అసలు గుళ్లల్లోకి పోతున్న భావన కలుగుతున్నదని ఆదివాసీ పెద్ద ఒకరు చెప్పారు.
ఆదివాసీ కుంభమేళాగా ప్రపంచ ప్రసిద్ధికెక్కిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రభుత్వం పునరుద్ధరణ పనులు చేపట్టింది. గ్రానైట్‌తో గద్దెలు, వాటిచుట్టూ స్తంభాలు, స్వాగత తోరణాలు ఏర్పాటుచేస్తున్నది. అసలు మేడారం జాతరంటేనే ప్రకృతితో మమేకమైన జాతర. ఈ జాతరలో ఎక్కడచూసినా చెట్లు, పుట్టలే కనిపించాలి.. ఏ మూల చూసినా ఆదివాసీ ఆచార, సంప్రదాయాలే ప్రతిబింబించాలి. కానీ, ప్రస్తుతం మేడారం పూర్తిగా కాంక్రీట్ మయమైంది. ఎటుచూసినా రాతిస్తంభాలే కనిపిస్తున్నాయి. చెట్లు అందులో ఒక మూలన కనిపించీ కనిపించకుండా ఉండటంతో అత్యంత ప్రాచీనమైన మేడారం జాతర ఆధునిక పోకడలతో పూర్తిగా మారిపోయింది. గతంలో చిలకలగుట్ట దగ్గర ఒక ప్రహరీ కడుతామంటేనే ఆదివాసీలు తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత ఒక స్వామీజీ మేడారం జాతర విషయంలో దుర్గాదేవి ప్రతిరూపమని వ్యాఖ్యానిస్తే.. సమాజమంతా ఆ వ్యాఖ్యలను ఖండించింది.
గతంలో జాతర సమయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో లడ్డూ, పులిహోర ప్రసాదం పంచిపెడితే ఆదివాసీలు, భక్తులు దానిని నిలిపివేయించారు. తమ దేవతల విషయంలో, ఆచార, వ్యవహారాల విషయంలో ఇతరుల జోక్యాన్ని సహించేది లేదంటూ అప్పట్లో ధర్నాలు చేశారు. మంత్రి సీతక్క స్వయంగా ఆదివాసీ కావడంతో ఆమె తమ జాతరను ప్రకృతివనంగా తీర్చిదిద్దుతారని ఆశించారు. గతంలో ఆమె ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పలుసార్లు గద్దెల దగ్గర, చుట్టుపక్కల మరో అడవి సృష్టించాలని, చెట్లు కొట్టేయకుండా, రాతి కట్టడాలే లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. కానీ, ఇప్పుడు ఆమె నేతృత్వంలోనే రాతికట్టడాలు వస్తుండగా, చిహ్నాలు కూడా మారిపోయాయి.
ఆదివాసీల గొట్లు, గోత్రాలకు సంబంధించిన చిహ్నాలతోపాటు తిరునామాలు, శంఖుచక్రాలు, శివలింగం, స్వస్తిక్.. ఇలా బ్రాహ్మణీయ భావజాలం ప్రతిబింబించే దేవాలయాలకు సంబంధించిన చిహ్నాలను ఈ జాతరలో జొప్పించారు. అసలు ఆదివాసీ మేడారం జాతరలో దేవతల ప్రతిరూపంగా భావించే పులి, జింక, దుప్పి, పావురం, ఏనుగు, నెమలి, మొసలి, పశుపక్ష్యాదులతోపాటు కోయల జీవనశైలికి, ఆచార సంప్రదాయాలకు, గొట్టు గోత్రాలకు ప్రతిరూపంగా సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంక, బండిచక్రాలు, అడ్డ, నిలువు గీతలు స్తంభాలపై చెక్కడంతోపాటు ఈ తిరునామాలేమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే, సమ్మక్క సారలమ్మ వంశస్తులైన దాదాపు 250 కోయల ఇంటి పేర్లు, వారి మూలాలను శిలలపై చెక్కడం ద్వారా వాళ్ల చరిత్రను భావితరాలు తెలుసుకునే వీలుంటుందని స్థానిక అధికారులు తెలిపారు.
సమ్మక్క, సారలమ్మ తల్లుల చరిత్ర అందరికీ తెలిసేలా కోయల వద్ద దొరికిన 900 ఏండ్లనాటి తాళపత్రాల గ్రంథాల ఆధారంగా ఏడువేల శిల్పాలు, చిహ్నాలు చెక్కుతున్నట్టు ఆర్కిటెక్ట్‌లు చెప్తున్నారు. ఈ ప్రాచీన చరిత్రలో కూడా ఎక్కడా తిరునామాలు కానీ, శంఖుచక్రాలు కానీ లేవని ఆదివాసీ జాతరపై పరిశోధన చేసిన పలువురు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా కేవలం జాతరకు కొత్త రూపు సంతరిస్తున్న పేరుతో ఆదివాసీ ఆచార, వ్యవహారాలను మంటగలపడమేనని వారు మండిపడుతున్నారు. ఈ విషయంలో ఆదివాసీ వడ్డెల్లో (పూజార్లు) కూడా తమ సంప్రదాయాలను ప్రతిబింబించే చిహ్నాల్లో ఈ కొత్త గుర్తులేంటనే చర్చ జరుగుతున్నది. ఆదివాసీ ఆచార, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రకృతిసిద్ధంగా రూపుదిద్దుకున్న మేడారాన్ని ఆధునిక ఆలయంగా చూపించి సహజత్వం నుంచి కృత్రిమత్వానికి తీసుకొస్తున్న ఈ పనులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.