హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలా విమర్శలు చేశారంటూ బీఆర్ఎస్ హు జూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఒకే వ్యక్తిపై ఒకే తరహా అభియోగాలతో వేర్వేరు చోట్ల కేసులను ఎలా నమోదు చేస్తారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. అన్ని ఎఫ్ఐఆర్లపై దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. బంజారాహిల్స్, రాజేంద్రనగర్, చేవెళ్ల, శంకర్పల్లి, మోకిల, షాద్‌నగర్ పోలీస్స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్ల విషయంలో పోలీసులు ముందు కు వెళ్లరాదని ఆదేశించింది. ప్రతివాదులైన హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, ఇతరులకు నోటీసులు జారీచేసింది. కౌంటర్ దాఖ లు చేయాలని చెప్పింది. ఆరు పోలీస్స్టేషన్లలో ఒకే తరహా అంశంపై విడివిడిగా ఎఫ్ఐఆర్ల ను నమోదు చేయడం చట్ట వ్యతిరేకమని పేరొంటూ కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ విచారించి ఉత్తర్వులు వెలువరించారు.
ఫిర్యాదులన్నీ ఒకేతీరుగా ఎలా?
అంతకుముందు విచారణ సందర్భంగా కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాది టీవీ రమణరావు వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ఒకే తరహా అభియోగంపై వేర్వేరు ఎఫ్ఐఆర్లను నమోదు చేయడానికి వీల్లేదని చెప్పారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌తోపాటు మరో ఐదు పోలీస్స్టేషన్లలో కేసుల నమోదు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు వ్యతిరేకమని తెలిపారు. ఐపీసీలోని సెక్షన్ 504 (శాంతి భద్రతలకు విఘాతం), సెక్షన్ 505(2) (విద్వేషం రేకెత్తించడం), సెక్షన్ 500 (పరువు నష్టం) వంటి సెక్షన్ల కింద కేసుల నమోదు చెల్లదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య చైర్పర్సన్ కాల్వ సుజాత గుప్తా మరో ఐదుగురు వేర్వేరుగా చేసిన ఫిర్యాదుల మేరకు బంజారాహిల్స్, రాజేంద్రనగర్, చేవెళ్ల, శంకర్పల్లి, మోకిల, షాద్‌నగర్ పోలీస్స్టేషన్లల్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిపారు. కేసులన్నీ ఏకపక్షంగా, రాజకీయ దురుద్దేశంతో నమోదు చేశారని, రాజ్యాంగంలోని 14, 21 అధికరణలకు విరుద్ధమని చెప్పారు.
రాజకీయంగా కక్షసాధింపుతో ప్రభుత్వం కేసులు పెట్టిస్తున్నదని అన్నారు. పిటిషనర్‌పై రాష్ట్రవ్యాప్తంగా 40 నుంచి 50 ఎఫ్ఐఆర్లు ఉంటాయని తెలిపారు. అన్ని కేసులూ.. అభియోగాలు నిరూపణ అయితే ఏడేండ్లలోపు శిక్ష పడేవేనని వివరించారు. వాదనల అనంతరం హైకోర్టు.. అభియోగాల ప్రస్తావన ఫిర్యాదుల్లో లేదని తప్పుపట్టింది. కౌశిక్‌రెడ్డి సీఎంపై అవమానకరమైన, పరువు నష్టం కలిగించేలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారని, కానీ సదరు ఫిర్యాదుల్లో ఆయన ఏ తరహా వ్యాఖ్యలు చేశారో పేరొనలేదని ఎత్తిచూపింది. ఇదే తరహాలో ఇతర ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొంది. ఒకరు ఫిర్యాదు చేసిన అరగంట వ్యవధిలోనే మరో ఫిర్యాదుదారుడు పోలీసుల వద్దకు వెళ్లారని గుర్తుచేసింది. ‘ఇద్దరు చేసిన ఫిర్యాదుల్లోని అంశాలు ఒకేలా ఉన్నాయి.
మరో నలుగురు ఫిర్యాదుదారులు చేసిన ఫిర్యాదులు దాదాపు యథాతథంగా ఉన్నాయి. ఫిర్యాదుల్లోని విషయాలన్నీ ఒకే తీరుగా ఉన్నాయి. వాటిలో పిటిషనర్ సీఎంపై చేసిన అవమానకరమైన, పరువు నష్టం కలిగించే అభ్యంతరకరమైన వ్యాఖ్యల ప్రస్తావనే లేదు. అయినప్పటికీ పిటిషనర్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. పిటిషనర్‌పై నేరాల నమోదు ఆమోదయోగ్యంగా లేదు. అందుకే పిటిషనర్‌పై వివిధ పోలీస్స్టేషన్లల్లో నమోదైన కేసుల్లో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తున్నాం’ అని స్పష్టంచేసింది. వివిధ పోలీస్స్టేషన్లలో పిటిషనర్ కౌశిక్‌రెడ్డిపై చిన్నచిన్న అభియోగాలతో రాష్ట్రవ్యాప్తంగా 40 నుంచి 50 కేసులు నమోదు అయ్యాయని న్యాయవాది టీవీ రమణరావు తెలిపారు. దీనిపై హోం శాఖకు నోటీసులు ఇస్తున్నామని కోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేరొంది.