హైదరాబాద్, మే18 (నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఆద్యాల, నాగారం గ్రామాల పరిధిలో బొగ్గు గనులపై మట్టిని రహదారి నిర్మాణానికి తరలించడాన్ని అరికట్టాలని కోరుతూ సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి అధికారులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాల ని హైకోర్టు ఆదేశించింది. ఉత్తర్వుల ప్రతిని అందుకున్న నాలుగు వారాల్లో సమస్యను పరిషరించాలని స్పష్టం చేసింది. పిటిషనర్‌తోపాటు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఇతర సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చేసి, వారికి వాదనలు వినిపించే అవకాశం ఇచ్చిన అనంతరం చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని పేరొంది.
రామగుండం ఆర్జీ-3 ఓపెన్‌కాస్ట్ మైన్స్ నుంచి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు చెందిన సుమారు 40 లక్షల క్యూబిక్ మీటర్ల మేర దాదాపు రూ.22 కోట్ల విలువైన ఓవర్ బర్డెన్ (పైపొర) మట్టిని అక్రమంగా తరలిస్తున్నారంటూ పుట్ట ముఖేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రైవేట్ ప్రతివాదులు ఆరు నెలలుగా ఆర్జీ-3 ఓపె న్ కాస్ట్ నుంచి మట్టిని తరలిస్తున్నప్పటికీ అ ధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. గనుల చట్టం-1952, ఖనిజ రాయితీ నియమాలు, పర్యావరణ పరిరక్షణ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎటువంటి చట్టబద్ధ అనుమతులు లేకుండానే మట్టిని తరలిస్తున్నారని తెలిపారు.