హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ప్రయాణికుల సౌకర్యార్థం పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై కొన్ని కొత్త సూపర్ లగ్జరీ బస్సులను రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రవాణా కమిషనర్ జ్యోతి బుద్ధాప్రకాశ్ హాజరుకానున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 392 కోట్లతో 1,016 కొత్త బస్సులను కొనాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. మొదటి విడతలో 630 సూపర్ లగ్జరీ, 130 డీలక్స్, 16 స్లీపర్ బస్సులను టెండర్ల ద్వారా కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. ఈ బస్సులన్నీ 2023 మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి.
ట్రాకింగ్ సిస్టం.. ప్యానిక్ బటన్
కొత్త సూపర్ లగ్జరీ బస్సులకు సాంకేతికతను జోడించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల్లో ట్రాకింగ్ సిస్టంతో పాటు ప్యానిక్ బటన్ సదుపాయం కల్పించనున్నారు. వాటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంకు అనుసంధానం చేస్తారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురైతే ప్యానిక్ బటన్‌ను నొకగానే టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంకు సమాచారం అందుతుంది. ఈ సమాచారం ద్వారా అధికారులు వేగంగా స్పందించి చర్యలు తీసుకొంటారు. ప్రతి బస్సులో ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులు, సెక్యూరిటీ కెమెరాలు, రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరాలు, ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం, సెల్‌ఫోన్ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు.