హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): వాహన పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు మూడు నెలల్లోపు కట్టని వారిపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ఈ మేరకు కేంద్రం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం.. వారి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తున్నామని ఇటీవల ప్రొగ్రెస్ రిపోర్టులో పేర్కొన్నది. ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘిస్తూ వాహనాలను నడుపుతున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిసున్నట్టు రవాణాశాఖ తెలిపింది. 2023 డిసెంబరు నుంచి 2025 జూన్ వరకు రాష్ట్రవ్యాప్తంగా 18,973 డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసినట్టు పేర్కొన్నది.
మద్యం సేవించడం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం, అతివేగంతో డ్రైవింగ్ చేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారి లైసెన్సులు రద్దు అయినట్టు రిపోర్ట్‌లో వెల్లడించింది. కాగా, 2024 నవంబర్ 16నుంచి 2025 జూన్ 30వరకు 49,633 ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీలకు) రూ.369. 27 కోట్ల రోడ్ ట్యాక్స్ మినహాయింపును ఇచ్చినట్టు ప్రగతి నివేదికలో వివరించింది. డ్రైవింగ్ సిల్‌ను పరీక్షించేందుకు 25 బైక్ట్రాక్లు, 27 ఫోర్విల్లర్, 5 భారీ వాహనాల ట్రాక్‌లను అధునాతన టెక్నాలజీతో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లుగా మార్చేందుకు నిర్ణయించినట్టు వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 30వరకు13.05 లక్షల వాహనాలు టీజీ కోడ్‌తో మార్పు చేసినట్టు నివేదికలో తెలిపింది.