హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ): లక్ష కోట్ల రూపాయల మూసీ ప్రాజెక్టు అవాస్తవాలకు వేదిక అవుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూసీ సుందరీకరణకు డీపీఆర్ ఖరారు చేశామంటూ అడ్డగోలు కూల్చివేతలు మొదలుపెట్టి జనాలను భయభ్రాంతులకు గురిచేసిన కాంగ్రెస్ సర్కారు, ఇప్పుడు వివరాలు అడిగితే మాత్రం దాటవేసే ధోరణి అవలంబిస్తున్నది. బఫర్ జోన్ నిర్ధారణ నుంచి మూసీ పేరిట ఏర్పాటు చేసిన కమిటీల వరకు ఏ ఒక్క సమాచారమూ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నది.
మూసీ అభివృద్ధి పేరిట వేల కోట్ల భూములపై కన్నేసిన కాంగ్రెస్ సర్కారు పరీవాహక ప్రజల జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చిందన్న విమర్శలున్నాయి. ఓవైపు లక్షన్నర కోట్లతో మూసీని అభివృద్ధి చేసి నదికి పునరుజ్జీవం పోస్తామని చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి డీపీఆర్‌ను బయటపెట్టేందుకు మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. ఆయన మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉన్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో సమాచారాన్ని తొక్కిపెట్టి, పారదర్శకతకు పాతరేస్తున్నారు. మూసీ మాస్టర్ ప్లాన్ పేరిట ఎన్నో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో డీపీఆర్ పూర్తి కాకుండానే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులిచ్చేందుకు అంగీకరించినట్టుగా సర్కారు పెద్దలు ప్రకటించారు. కానీ డీపీఆర్ లేకుండా ప్రాజెక్టుకు నిధులు ఎలా మంజూరు చేశారనే విషయాన్ని అధికారులు, ప్రభుత్వ పెద్దలు తేల్చడం లేదు.
మూసీలో వాస్తవాల పాతర
మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలు మొదటి నుంచీ అనుమానాస్పదంగానే ఉన్నాయి. రూ. 30 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును లక్షన్నర కోట్లకు పెంచిన రేవంత్‌రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తాయి. తెరవెనుక ఎలాంటి ఉద్దేశమూ లేకపోతే మూసీ అభివృద్ధి పేరిట జరుగుతున్న వాస్తవాలను ఎందుకు దాచిపెడుతున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మూసీ అభివృద్ధిని అందరూ స్వాగతిస్తున్నప్పటికీ ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
ఈ క్రమంలో స్పష్టతనివ్వాల్సిన ప్రభుత్వం వాస్తవాలను ఎందుకు దాచిపెడుతున్నది అందరి మెదళ్లను తొలిచేస్తున్నది. మూసీకి ఇరువైపులా వేల కోట్ల విలువ చేసే భూములను దక్కించుకోవడమే లక్ష్యంగా బఫర్ జోన్‌ను నిర్ణయించినట్టు కూడా విమర్శలు వచ్చాయి. దీనికి తగ్గట్టుగానే ఇరువైపులా 200 మీటర్ల దూరం వరకు కూల్చివేతలతో వందల కొద్దీ నిర్మాణాలను నేలకూల్చింది. ఇప్పుడు వీటన్నింటినీ దాచిపెడుతున్న సర్కారు చివరకు ఆర్టీఐ అస్ర్తానికి చిక్కకుండా జాగ్రత్త పడుతున్నది. మూసీ అభివృద్ధిలో పారదర్శకత అవసరమని ప్రజా సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.