Sircilla | కలెక్టరేట్, జూన్ 10: ట్రాన్స్జెండర్ల స్వయంసమృద్ధి దిశగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి అడుగులు పడుతున్నాయి. కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్ల ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక కృషి జరుగుతున్నది. సిరిసిల్లలో ట్రాన్స్జెండర్ల ఉపాధి కోసం పెట్రోల్ పంప్ ఏర్పాటుకు రూ.3 కోట్లు మంజూరు చేయించారు. గత జనవరిలోనే దీని ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు.
ఇండియన్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో పంప్ ఏర్పాటుకు పట్టణ శివారులోని రెండో బైపాస్‌లో స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి. మరో మూడునెలల్లోనే పెట్రోల్ పంపు అందుబాటులోకి రానుండగా 15 మంది ట్రాన్స్జెండర్లకు ప్రత్యక్షంగా, 10 మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నది.
వీ-హబ్ ఒప్పందంతో స్వయం ఉపాధి శిక్షణ
సమాన అవకాశాల చట్టం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లాలో ఉన్న ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తున్నది. కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు జిల్లాలో ఇప్పటివరకు 25 మంది ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు జారీచేశారు. వారి స్వయంఉపాధి కోసం వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు వీ-హబ్‌తో ఒప్పందం చేసుకున్నారు.
ఇందులో భాగంగానే సిరిసిల్లలో ట్రాన్స్జెండర్ల కోసం పెట్రోల్ పంప్ ఏర్పాటుకు కలెక్టర్ చొరవ చూపారు. ఆయన నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఇండియన్ ఆయిల్ కంపెనీ పెట్రోల్ పంప్‌ను మంజూరు చేసింది. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పూజారి గౌతమి ఆధ్వర్యంలో జిల్లాలోని ట్రాన్స్జెండర్లకు ఇటీవలే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెట్రోల్ పంప్ నిర్వహణపై లబ్ధిదారులైన ట్రాన్స్జెండర్లకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా సంక్షేమ అధికారి (నోడల్ ఆఫీసర్) లక్ష్మీరాజం ప్రణాళిక రూపొందిస్తున్నారు.
శాశ్వతంగా పని దొరుకుతుంది
పెంట్రోల్ పంపు ద్వారా మాకు శాశ్వతంగా పని దొరుకుతుంది. ఉపాధి కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండదు. శాశ్వత పని కల్పించేందుకే కలెక్టర్ మాకు దారిచూపారు. పంప్ నిర్వహణపై ఇటీవలే సమావేశం నిర్వహించారు. ఈ పెట్రోల్ పంపు ద్వారా ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది. దీనిని సద్వినియోగం చేసుకుంటాం.
-బీ మధుషా, సిరిసిల్ల