హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): భార్యాభర్తలిద్దరూ ఎక్సైజ్‌శాఖలో ఉన్నతస్థాయి ఉద్యోగులే. కంటి చూపులేని తల్లి, ఐదేండ్లలోపు ఇద్దరు చిన్నారులు. కొన్నేండ్లుగా ఉద్యోగ విధుల్లో చెరోచోట ఉంటూ నెట్టుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు వారికీ అనారోగ్య సమస్యలు తోడయ్యాయి. భార్య, భర్తదీ ఒకేశాఖ అయినా, స్పౌజ్ క్యాటగిరీలో బదిలీకి దరఖాస్తు చేసుకున్నా ఆ శాఖలో పట్టించుకునే దిక్కులేదు. భార్యాభర్తలు వేర్వేరుగా విధుల్లో ఉన్నామన్న మనస్తాపంతో ఒకానొక దశలో ఆ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించడాన్ని చూసి ఆ కుటుంబం మొత్తం తల్లడిల్లిపోయింది.
ఇదీ.. ఎక్సైజ్ శాఖలో ఓ ఇద్దరి వ్యథ. ఇలాంటి వారు 2,000మంది వరకూ ఉన్నారు. బదిలీల కోసం వేయికండ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు. మంత్రి ఆదేశాలు ఇచ్చినా, సంబంధిత అధికారులు బదిలీలు చేపట్టకపోవడంతో ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నాయి. ఈ శాఖలో పనిచేసే వివాహితలైన మహిళా కానిస్టేబుళ్లు ఏండ్ల తరబడి తమ కుటుంబాలకు దూరంగానే ఉంటున్నారు. ఈ శాఖలో గడిచిన ఎనిమిదేండ్లుగా కానిస్టేబుళ్లకు బదిలీలే లేవు. ఎక్సైజ్ శాఖలో బదిలీలు త్వరితగతిన చేపట్టాలని ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇప్పటికే నాలుగైదుసార్లు అధికారులను హెచ్చరించారు. ఆయన కిందిస్థాయి అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు.
2017లో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 143 ప్రకారం బదిలీలకు రంగం సిద్ధమైంది. దీంతో మరో నాలుగు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖలో బదిలీలు అంటూ మంత్రి ఊదరగొట్టారు. అది జరిగి రెండు నెలలైనా ఆ ప్రక్రియ మొత్తం ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. తాజాగా కొందరు ఎక్సైజ్ అధికారులు ఆ ప్రక్రియపై ఆరా తీయగా, అసలు 143 జీవో డియాక్టివేట్ అయిందని తేలింది. మళ్లీ పెద్ద ప్రక్రియ చేపడితేనే ఆ జీవో ప్రకారం బదిలీలు అవుతాయి. ఆ దిశగా ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు తీవ్ర నిర్లక్ష్యంతో మనుగడలో లేని 143జీవో ప్రకారం బదిలీల ప్రక్రియ చేపట్టడంపై ఎక్సైజ్‌శాఖ అధికారులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.