అప్పుడప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు తోడు మసురువానతో హైదరాబాద్‌లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. చిన్నాపెద్ద దవాఖానలన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రోగులకు శాపంగా మారింది. అనాలోచిత బదిలీల కారణంగా 60 శాతానికిపైగా సీనియర్ వైద్యులకు స్థానచలనమైంది. ఫలితంగా నగరంలోని ప్రధాన టీచింగ్ దవాఖానలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గాంధీ, ఉస్మానియాలో ఆపరేషన్లు నిలిచిపోవడంతో రోగులు విలవిల్లాడుతున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ): l డాక్టర్ రాజారావు.. జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్. 2020లో కరోనా వంటి విపత్కర సమయంలో గాంధీ దవాఖాన ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. యావత్తు ప్రపంచం గడగడలాడుతున్న తరుణంలో మహమ్మారి విసిరే సవాళ్లను ఎదుర్కొంటూ రెండువేల పడకలున్న గాంధీ హాస్పిటల్‌ను నిర్వహించారు. కేవలం ఐసీయూలో మాత్రమే ఆక్సిజన్ పడకలు ఉంటే… కరోనా దృష్ట్యా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అన్ని పడకలను ఆక్సిజన్ పడకలుగా మార్చి ఏర్పాట్లు కల్పించింది. క్లిష్టమైన ఆ సమయంలో ఇతర వైద్యులు, సిబ్బంది సహకారంతో రాజారావు సమర్థంగా బాధ్యతలు నిర్వహించడంతో గాంధీ దవాఖాన వేల మంది ప్రాణాలను కాపాడగలిగింది. మరి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఆయనను 200 పడకలున్న భువనగిరి దవాఖానకు బదిలీ చేసింది. రోజుకు 2-3వేల ఓపీ ఉండే దవాఖాన నుంచి ఇప్పుడు ఆయన రోజుకు సుమారు 30 ఓపీ ఉండే దవాఖానలో విధులు నిర్వహిస్తున్నారు.
ప్రొఫెసర్ డాక్టర్ నాగేందర్.. జనరల్ సర్జన్. హైదరాబాద్‌లో ఎంతో పురాతనమైన ఉస్మానియా దవాఖానకు రోజూ మూడువేల మంది వరకు రోగులు వస్తుంటారు. ఈ దవాఖానకు 2017లో ఇన్చార్జ్ సూపరింటెండెంట్‌గా వచ్చిన డాక్టర్ నాగేందర్ 2021 నుంచి పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వం సర్కారు దవాఖానాల రూపురేఖలు మార్చిన తరుణంలో ఉస్మానియా వైద్యాలయాన్ని అంతర్జాతీయ స్థాయి శస్త్రచికిత్సలకు వేదికగా నిలపడంలో సర్కారు, ఇతర వైద్యులు, సిబ్బంది సహకారాన్ని తీసుకుని ఆయన విజయవంతమయ్యారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ నాగేందర్‌ను కేవలం 30 పడకలున్న (మంజూరు వంద పడకలు) మహేశ్వరం ఏరియా దవాఖానకు బదిలీ చేసింది.
డాక్టర్ శంకర్.. జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్. నగరంలో నిరుపేదలకెవరికైనా తీవ్రమైన జ్వరం వచ్చిందంటే గుర్తొచ్చేది కోరంటి (నల్లకుంట ఫీవర్) దవాఖాన. ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా శంకర్ 2012 నుంచి 12 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. దశాబ్ద కాలానికి పైగా ఒకే స్థానంలో ఉన్నారంటే ప్రభుత్వాలు ఆయన సేవలు అక్కడ కీలకమని భావించాయి. సీజనల్ వ్యాధులు విజృంభించినపుడు రోజుకు 800 వరకు ఓపీ ఉండే దవాఖానను ఆయన ఎంతో సమర్థంగా నిర్వహించారు. ఇప్పుడు డాక్టర్ శంకర్ రెండు వందల పడకలు ఉన్న జనగాం దవాఖానకు బదిలీ అయ్యారు.
అంతేకాదు మరో ఇద్దరు ప్రొఫెసర్లను కూడా బదిలీ చేయడంతో నల్లకుంట కోరంటి దవాఖానలో ఉన్న మూడుకు మూడు ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. అసలే వారం, పది రోజుల ముసురుతో నగరంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ తరుణంలో నిరుపేదలకు వైద్య సేవలు అందడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన వైద్యుల బదిలీల తీరుకు ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు.
రాష్ట్రంలో ప్రభుత్వం వైద్యశాఖలో చేపట్టిన బదిలీల ప్రక్రియ కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిన చందంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో వేల పడకలున్న దవాఖానల బాధ్యతను సమర్థంగా నిర్వహించిన ప్రొఫెసర్లను జిల్లా కేంద్రాల్లోని చిన్న తరహా దవాఖానలకు బదిలీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింద న్న చందంగా.. వైద్యారోగ్యశాఖలో ప్రభుత్వం చేపట్టిన డాక్టర్ల బదిలీలు రోగులకు శాపంగా మారాయి. ప్రభుత్వరంగంలో సూపర్‌స్పెషాలిటీ దవాఖానలైన ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ల నుంచి సీనియర్ డాక్టర్లందరూ బదిలీ కావడంతో వాటిలోని టీచింగ్ విభాగాలన్నీ దాదాపు ఖాళీ అయ్యాయి. సాధారణ బదిలీల్లో భాగంగా వర్కింగ్ స్టాఫ్‌లో 15 నుంచి 20 శాతం మందిని బదిలీ చేయడం సర్వసాధారణం. కానీ వర్కింగ్ స్టాఫ్‌లో 40 శాతం మందిని బదిలీ చేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో రోగులకు కష్టాలు తప్పడం లేదు. అంతేకాకుండా ఉస్మానియా, గాంధీ తదితర దవాఖానల్లో 60 శాతానికి పైగా సీనియర్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు బదిలీ అయ్యారు. దీంతో అటు రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడం, ఇటు వైద్య విద్యార్థులకు బోధన ప్రశ్నార్థకంగా మారింది. ఉస్మానియా దవాఖానలో 60 శాతం మంది సీనియర్ వైద్యులు బదిలీ కాగా, గాంధీలో 40 మంది సీనియర్ డాక్టర్లు వేరే చోటకు బదిలీ అయ్యారు. నిలోఫర్‌లో మొత్తం 12 యూనిట్లకు గాను ఒకేసారి 9మంది ప్రొఫెసర్లు బదిలీ కాగా కేవలం ఇద్దరు ప్రొఫెసర్లు మాత్రమే ఇతర దవాఖానల నుంచి బదిలీపై నిలోఫర్‌కు వచ్చారు. దీంతో ప్రస్తుతం నిలోఫర్‌లో ఉన్న 12యూనిట్లకు కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు.
సీనియర్ వైద్యులు, ప్రొఫెసర్లు బదిలీలపై ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, కోఠి ఈఎన్టి తదితర దవాఖానల్లో పలు రకాల శస్త్రచికిత్సలు భారీగా తగ్గిపోయినట్టు సమాచారం. డాక్టర్లు లేరంటూ శస్త్రచికిత్సలు వాయిదా వేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. కొన్ని రకాల సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో సైతం సేవలకు అంతరాయం ఏర్పడుతున్నట్టు రోగులు చెప్తున్నారు.
సీనియర్ వైద్యనిపుణులు లేకపోతే తమకు వైద్య విద్య బోధన ఎలా అని వైద్యవిద్యార్థులు వాపోతున్నారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో సీనియర్ డాక్టర్లు బదిలీ కావడం తమ చదవుపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత దశలవారీగా వైద్యుల బదిలీలు చేపట్టాల్సిందని వారు అభిప్రాయపడుతున్నారు.
గాంధీ, ఉస్మానియా, ఫీవర్, నిలోఫర్ దవాఖానల్లో బదిలీల ప్రక్రియ నిర్వహించేపుడు ప్రభుత్వం అత్యంత అప్రమత్తత ప్రదర్శించాలి. కానీ గుడ్డెద్దు చేనులో పడ్డట్టు.. ఆయా దవాఖానలపై నిరుపేద రోగులు పెట్టుకున్న నమ్మకం.. సంబంధిత వైద్యుల అనివార్యత.. అంతకుమించి గతంలో వారు అందించిన సేవలను పట్టించుకోకుండా బదిలీల ప్రక్రియను చేపట్టారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చే రోగుల పరిస్థితి ఏమిటి? వచ్చిన కొత్తవాళ్లు కుదురుకునే వరకు ఏర్పడే ఇబ్బందులు సాధారణ, అమాయక ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉంటాయి. సరిగ్గా ఇక్కడే ప్రభుత్వం, సంబంధిత శాఖ తన ఒడుపు, చాకచక్యాన్ని, విచక్షణను ప్రదర్శించాలి.
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): వైద్యశాఖ బదిలీల్లో అవినీతి ఆరోపణలపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యశాఖ బదిలీల్లో అక్రమాలు జరిగాయంటూ శనివారం మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో విజిలెన్స్ విచారణ చేపట్టాలని వైద్యశాఖ కార్యదర్శిని ఆదేశించారు. బదిలీల్లో అవకతవకలకు పాల్పడినట్టు తేలితే.. వారు ఏ స్థాయి వారైనా కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): వైద్యశాఖలో బదిలీలకు సంబంధించి కొన్ని తప్పిదాలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని డీపీహెచ్ రవీందర్ నాయక్ పేర్కొన్నారు. అయితే వసూళ్ల ఆరోపణలు మాత్రం అవాస్తమవని చెప్పారు. ‘వైద్యశాఖ బదిలీల్లో అక్రమాలు’ పేరుతో శనివారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. గుర్తింపు పొందిన యూనియన్లకు ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును కొందరు దుర్వినియోగం చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లా స్థాయి కమిటీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు.