పెద్దపల్లి, మే 24 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో బదిలీల ప్రక్రియ కఠినతరమైంది. కొద్దిరోజులుగా పెరిగిన రాజకీయ జోక్యంతో ఇబ్బందులు వస్తుండగా, వాటికి చెక్‌పెడుతూ పలు కఠిన నిబంధనలతో కూడిన సర్క్యూలర్‌ను యాజమాన్యం ఇటీవలే విడుదల చేసింది. కార్మికుడికి సర్వీసులో రెండేసార్లు స్థానచలనానికి అవకాశం ఇవ్వడం, ప్రతి ఒక్కరూ మూడేండ్లపాటు భూగర్భ గనిలో పని చేయాలని, ఇలా పలు నిబంధనలు విధిస్తూ మార్గదర్శకాలు జారీ చేయగా, కార్మికుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
ఈ నిబంధనలతో బదిలీ న్యాయంగా అవసరమైన కార్మికులకు అన్యాయం జరుగుతుందనే వాదన వినిపిస్తున్నది. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఒక ఓసీపీలో పనిచేసే కార్మికుడు ఇటీవల మరో గనికి బదిలీపై వెళ్లాడు. తీరా మూడు రోజుల తర్వాత సదరు కార్మికుడు ఓ నేత ద్వారా సిఫారసు లేఖ తెచ్చుకొని తనకు నచ్చిన మరో ఓసీపీకి బదిలీ చేయించుకున్నాడు. ఇలా చాలామంది కార్మికులు రాజకీయ అండదండలు, డబ్బులతో ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొని తమకు నచ్చినచోట సులభంగా డ్యూటీ చేసుకునే విధంగా బదిలీల పర్వాన్ని కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి.
ఈ ప్రక్రియలో కార్మిక, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున డబ్బులను దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత మాత్రం పెద్ద ఎత్తున రాజకీయ జోక్యం పెరగడంతో అదే స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో రాజకీయ ఒత్తిళ్లు, ఉన్నతాధికారుల ఆదేశాలు, యువ ఉద్యోగుల డిమాండ్ల నుంచి తప్పించుకునేందుకు కొత్త విధివిధానాలను రూపొందిస్తూ యాజమాన్యం జారీ చేసిన సర్క్యూలర్ జూన్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నది.