ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖలు, వాటి పరిధిలోని గురుకులాల్లో ఇటీవల చేపట్టిన బదిలీలు, ప్రమోషన్లపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బదిలీలు, ప్రమోషన్ల కోసం రూపొందించిన సీనియార్టీ జాబితాలను తప్పులతడకగా రూపొందించారని సంబంధిత శాఖల్లోని ఉద్యోగ, ఉపాధ్యాయులు నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు కల్పించారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోని ఎస్సీ గురుకులంలోని బదిలీలే నిలువెత్తు నిదర్శనంగా ఉదహరిస్తున్నారు.
Gurukula Schools | హైదరాబాద్, ఆగస్టు11 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. ఇక్కడి గురుకులంలో 5 నుంచి ఇంటర్ వరకు విద్యాబోధన కొనసాగుతుండగా, 500-600 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఆ మేరకు గురుకుల సిబ్బందిని నియమించలేదు. గురుకులంలోని జూనియర్ లెక్చరర్ పోస్టుల్లో గణితం తప్ప తెలుగు, ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టుల పోస్టులన్నీ ఖాళీగానే పెట్టారు.
పీజీటీకి సంబంధించి తెలుగు, గణితం, సోషల్, హిందీ, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్, ఫిజికల్ డైరెక్టర్, పీఈటీ, ఆర్ట్ టీచర్, సీనియర్ అసిస్టెంట్ మొత్తంగా 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీజీటీకి సంబంధించి బయోసైన్స్, తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సోషల్, ఫిజికల్ సైన్స్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఒక్క కొడంగల్ బాలుర గురుకులంలోనే మొత్తంగా 22 పోస్టులు ఖాళీ పెట్టడం గమనార్హం.
హైదరాబాద్, రంగారెడ్డితో పాటు పలు జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లోని గురుకులాల్లో కొన్ని గ్రూపులకు విద్యార్థులు లేకున్నా అక్కడ అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు, లెక్చరర్లను నియమించటం విచిత్రం. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌లోని ఎస్సీ గురుకులంలో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపులున్నాయి. ఈ రెండు గ్రూపుల్లో విద్యార్థులెవరూ లేకపోయినా అన్ని సబ్జెక్టులకు జేఎల్స్‌ను నియమించారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్, నల్లగొండ జల్లా తిప్పర్తి, అనుముల, నకిరేకల్ గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి.
ప్రభుత్వం ఒక ఉత్తర్వు ఇవ్వాలంటే కచ్చితంగా ఒక ఫైల్ మూమెంట్ తర్వాత, అప్రూవల్ అయిన తర్వాత ఆ ఫైల్ నంబరు, ప్రొసీడింగ్స్ నంబర్‌ను మెన్షన్ చేస్తూ బదిలీగానీ, ప్రమోషన్ ఉత్తర్వులు గానీ, నూతన నియామక ఆదేశాలు గానీ ఇవ్వాలి. అలా ఇచ్చిన ప్రతి ఉత్తర్వు మీద జారీచేసిన అధికారి పేరు, హోదాను పేర్కొనటం సంప్రదాయం. అప్రూవల్ కాపీలలో ఉండే ప్రొసీడింగ్స్ నంబర్స్ ఆధారంగా ప్రతి ఉద్యోగి వివరాలు వారివారి సర్వీస్ రిజిస్టర్లలో నమోదు చేస్తుంటారు. కానీ, ఎస్సీ, మైనార్టీ గురుకులాల్లో అందుకు పూర్తి విరుద్ధంగా ఒక విచిత్ర పరిస్థితి నెలకొన్నది. ఒక కార్పొరేట్ సెక్టార్లో సర్టిఫికెట్ ఇచ్చినట్టు మాదిరిగా ప్రమోషన్, బదిలీ, నూతన నియామక ఉత్తర్వులను జారీచేయటం ఉపాధ్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆర్ట్ విభాగానికి సంబంధించి జోన్-3లో ఉన్న ఓ ఉద్యోగిని తొలుత జోన్-5కు బదిలీ చేశారు. ఆ వెంటనే జోన్-4కు బదిలీ చేసి మళ్లీ జోన్-3లోనే పోస్టింగ్ ఇచ్చారు. మళ్లీ రాత్రికిరాత్రే సదరు ఉద్యోగిని జోన్-1కి, ఆ మరుసటి రోజున అక్కడి నుంచి జోన్-2కు మారుస్తూ పోస్టింగ్ ఇచ్చారు. చివరికి ఇటీవల తిరిగి జోన్-5కు సదరు ఆర్ట్ టీచర్‌ను బదిలీ చేశారు. ఇదొక్కటే కాదు ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీ పీడీ (ఫిజికల్ డైరెక్టర్) బదిలీల జాబితాను సైతం 3 సార్లు మార్చారు. మహిళా గురుకులాల్లో పురుషులకు పోస్టింగ్ ఇవ్వకూడదనే నిబంధన పెట్టుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా పలువురికి మహిళా గురుకులాల్లో పోస్టింగ్ ఇచ్చారు. అంతేకాదు ఫోకల్ టు ఫోకల్ బదిలీ ఇవ్వకూడదు. ఆ నిబంధనకూ అధికారులు పాతరేశారు.
మైనార్టీ గురుకులాల్లోనూ ప్రమోషన్లు, బదిలీల ఉత్తర్వుల్లో గందరగోళమే. మొదట వెబ్ కౌన్సెలింగ్ అని చెప్పి తర్వాత మాన్యువల్‌గా మార్చారని, లాంగ్ స్టాండింగ్ ఉన్నవారికి సేమ్ ప్లేసెస్‌లో ప్రమోషన్లు ఇవ్వటాన్ని తప్పుబడుతూ కోర్టుకు వెళ్లిన వారికి కక్షసాధింపుగా ప్రమోషన్లను నిలిపివేశారని సొసైటీ ఉన్నతాధికారుల తీరుపై ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఎమ్మెస్సీ బాటనీ చేసిన వారికి జేఎల్ జువాలజీలుగా పదోన్నతి కల్పించారంటే సొసైటీలో పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోచ్చని ఉదహరిస్తున్నారు. ప్రమోషన్ తీసుకున్న ఉద్యోగులకు 24 గంటలు గడిచేలోగానే రివర్షన్ ఉత్తర్వులు ఇస్తున్న దుస్థితి నెలకొన్నది.
బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సంక్షేమ హాస్టళ్ల వెల్ఫేర్ ఆఫీసర్ (హెచ్‌డబ్ల్యూవో)ల బదిలీలను చేపట్టారు. ఇందులో 100కు పైగా పోస్టులకు పైరవీలతో పోస్టింగ్ ఇచ్చారని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. నాలుగేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అధికారులను తప్పనిసరి బదిలీ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే 15 ఏండ్లుగా ఒకే దగ్గర ఉద్యోగం చేస్తున్న వారిని బదిలీ చేసినట్టే చేసి, మళ్లీ అదే స్థానంలో పోస్టింగ్ ఇవ్వటమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఏడో జోన్ పరిధిలోని ముగ్గురు ఉద్యోగులను బదిలీ చేయకపోవటంలో అక్రమాలు జరిగినట్టు అనుమానాలు ఏర్పడుతున్నాయి. ఇక, గ్రేడ్-2 వార్డెన్లకు ఇటీవల బదిలీల ప్రక్రియలో సీనియార్టీ జాబితాను 2 సార్లు మార్చారు. స్పౌజ్ కేసుల విషయంలో వెసులుబాటు ఉన్నా ఆ విషయాన్ని విస్మరించి ఇష్టానుసారం బదిలీలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మైనార్టీ గురుకుల సొసైటీ బదిలీలకు తొలుత వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పే ఆప్షన్స్ తీసుకున్నాం. ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు రావటంతోనే మాన్యువల్‌గా నిర్వహించాం. ప్రధానంగా 317 జీవో డిస్‌లోకేటెడ్ సిబ్బంది ఉన్న చోట ఇబ్బందులు వచ్చాయి. సదరు సిబ్బంది ఉన్న పోస్టులను కూడా ఖాళీలుగా చూపటంతో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జరిగిన లోపాలన్నింటినీ గుర్తించి సరిచేస్తున్నాం. ఎవరికీ ఇబ్బంది లేకుండా న్యాయం చేస్తున్నాం.
– ఆయేషా మస్రత్ ఖానమ్, సెక్రటరీ, మైనార్టీ గురుకుల సొసైటీ