హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ‘ఉద్యోగుల్లో అశాంతి మంచిది కాదు. అలాంటి పరిస్థితులుంటే వారు సరిగ్గా పనిచేయలేరు. అందుకే పదోన్నతులు ఇచ్చాం. బదిలీలు చేపడతున్నాం. అసంతృప్తిని దూరం చేస్తున్నాం’ ఇది తరుచూ సీఎం మొదలు మంత్రుల వరకు చెప్పే నీతివాక్యాలు. కానీ గత లోక్‌సభ ఎన్నికల సమయంలో వివిధ స్థాయిల్లో ఉన్న వందలాది మంది అధికారులను బదిలీ చేసి ప్రభుత్వం వారిని వెనక్కి రప్పించడాన్ని విస్మరించింది. వీరి గోడును కనీసం పట్టించుకోకుండా గాలికొదిలేసింది. దీంతో వారంతా ఐదునెలలుగా ఆపసోపాలు పడుతున్నారు. ఎన్నికల సమయంలో కొన్ని కీలక శాఖల్లోని ఉద్యోగులను బదిలీచేయడం, ఎన్నికలు పూర్తికాగానే తిరిగి వెనక్కి రప్పించడం అనవాయితీ. ఈ తరహాలోనే మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉద్యోగులను పెద్ద ఎత్తున బదిలీ చేశారు. పంచాయతీరాజ్, పోలీస్, అటవీ, రెవెన్యూ, మున్సిపల్, ఎక్సైజ్ సహా 14 శాఖల్లో ఈ బదిలీలు జరిగాయి. మున్సిపల్ కమిషనర్లు సహా కింది స్థాయి ఉద్యోగులు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు,్ల ఇన్స్పెక్టర్లు, ఇన్ సబ్ ఇన్స్పెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలను బదిలీచేశారు. ఎన్నికలను సాకుగా చూపి ఇష్టారీతిన ఆనాడు బదిలీలు చేశారు. కనీసం ఆప్షన్లు కూడా ఇవ్వకుండా, ఒక్కొక్కరిని జిల్లాలకు జిల్లాలను దాటించి 150 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో పోస్టింగ్ ఇచ్చారు. ఎన్నికలు పూర్తవగానే వెనక్కి వస్తామన్న ధీమాతో ఆనాడు వెళ్లారు. కానీ ఎన్నికలు ముగిసి దాదాపు 5 నెలలు గడిచించి. కానీ బదిలీ చేసిన వారిని మాత్రం వెనక్కి రప్పించలేదు.
వివిధ జిల్లాల్లోని 399 మంది ఎంపీడీవోలను ఇష్టారీతిన బదిలీ చేశారు. వికారాబాద్ జిల్లాలోని ఓ ఎంపీడీవోను నారాయణపేట జిల్లాకు బదిలీచేశారు. నల్లగొండ నుంచి మెదక్, నారాయణపేట, వికారాబాద్ నుంచి సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో కర్ణాటక బార్డర్లో పోస్టింగ్ ఇచ్చారు. వరంగల్ నుంచి ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ చేసిన దాఖలాలు ఉన్నాయి. దాదాపు 300 మంది ఎంపీడీవోలను 150 కిలోమీటర్ల దూరంలో పోస్టింగ్ ఇచ్చారు. వీరిలో ఒక్కరినీ వెనక్కి తీసుకురాలేదు.
లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆప్షన్లు ఇవ్వకుండా ఇష్టారీతిన బదిలీలు చేశారు. కొందరు ఎంపీడీవోలను 250 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో వేశారు. నల్లగొండ జిల్లా వారిని నారాయణపేట జిల్లాకు బదిలీచేశారు. అనేక మంది కుటుంబాలకు దూరమయ్యారు. ఈ రెండు నెలల్లో పని ఒత్తిడితో ఆరుగురు ఎంపీడీవోలు చనిపోయారు. ఇప్పటివరకు ఆరుసార్లు మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం సమర్పించాం. సీఎస్‌లను కలిసి బదిలీ అయిన వారిని వెనక్కి రప్పించాలని కోరాం. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి ఇప్పటికైనా వారిని వెనక్కి రప్పిస్తుందని ఆశిస్తున్నాం.