హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఎక్సైజ్‌శాఖలో 326 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 1,586 మంది కానిస్టేబుళ్ల బదిలీల ప్రక్రియ పూర్తయింది. మొత్తం 1,912 మంది సిబ్బంది మూడు రోజుల్లో బదిలీ స్థానాల్లో రిపోర్టు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 4 నుంచి 10 వరకు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసినట్టు తెలిపారు. జోన్-1 కాళేశ్వరం పరిధిలో 27 మంది హెడ్ కానిస్టేబుళ్లు, జోన్-2 బాసరలో 50 మందికి, జోన్-3 రాజన్నలో 37 మందికి, జోన్-4 భద్రాద్రిలో 47 మందికి, జోన్-5 యాద్రాద్రిలో 27 మందికి, జోన్-6 చార్మినార్‌లో 108 మందికి, జోన్-7 జోగులాంబలో 30 మందికి బదిలీ ఉత్తర్వులను డిప్యూటీ కమిషనర్లు జారీ చేశారు. కానిస్టేబుళ్లు పెద్దపల్లి పరిధిలో 124 మంది, నిజామాబాద్‌లో 201 మంది, కరీంనగర్లో 236 మంది, వరంగల్‌లో 227 మంది, నల్లగొండలో 145 మంది, హైదరాబాద్‌లో 505 మంది, మహబూబ్‌నగర్‌లో 148 మంది బదిలీ ఉత్తర్వులు అందుకున్నవారిలో ఉన్నారు. బదిలీల ప్రక్రియను పూర్తిచేసిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు, సూపరింటెండెంట్లను కమిషనర్ హరికిరణ్ అభినందించారు.