హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అర్చకులు, ఆలయ ఉద్యోగులతోపాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులకు సైతం బదిలీలను వర్తింపజేస్తున్నారు. వీరిలో కొందరు నియామకం జరిగినప్పటి నుంచి ఒకేచోట పనిచేస్తుండగా, మరికొందరు సుమారు 20-25 ఏండ్ల నుంచి స్థానచలనం లేకుండా కొనసాగుతున్నారు. దీంతో అర్చకులను, ఆలయ ఉద్యోగులను బదిలీ చేసేందుకు దేవాదాయ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ శాఖలో దాదాపు 60-70% మంది ఉద్యోగులు గత పదేండ్ల నుంచి ఒకేచోట పనిచేస్తున్నారు. కొందరైతే ఏకంగా 15-20 ఏండ్ల నుంచి స్థానచలనం లేకుండా కొనసాగుతున్నారు.
పదోన్నతులు లభించినా పాత స్థానాన్ని వదలడం లేదు. కొందరు డిప్యూటీ కమిషనర్లు, సూపరింటెండెంట్లు, ఆలయ కార్యనిర్వహణాధికారులు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లకు పదేండ్ల నుంచి స్థానచలనం లేదు. కానీ, మొత్తం ఉద్యోగుల్లో 40% మందిని మాత్రమే బదిలీ చేసేందుకు వీలుండటంతో చాలా కాలం నుంచి ఒకేచోట కొనసాగుతున్న అర్చకులు, ఆలయ ఉద్యోగులను బదిలీ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఆలయాల నిర్వహణ సక్రమంగా సాగడంతోపాటు గతంలో ఏమైనా అక్రమాలు జరిగితే బయటకు వస్తాయని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు.