KTR | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): పదేండ్లపాటు గత బీఆర్ఎస్ సర్కారు సల్పిన సుదీర్ఘ పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం తాజాగా రక్షణ శాఖ భూములను కేటాయించిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారి, హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారి రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు రక్షణ శాఖ భూములు ఇవ్వడానికి కేంద్రం పచ్చజెండా ఊపడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. ఇది ముమ్మాటికీ బీఆర్ఎస్ సాధించిన విజయమని పేర్కొన్నారు. నిరుడు జూలై 31న జరిగిన క్యాబినెట్ సమావేశంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకున్నదని, దానికి అనుగుణంగానే కేంద్రం ఆమోదం తెలపడం హర్షించదగిన పరిణామమని పేర్కొన్నారు.
గతంలోనే రక్షణశాఖ తమ ఆధీనంలోని 33 ఎకరాలను కేటాయించిందని, ఇప్పుడు మరో 150 ఎకరాలనూ అప్పగించేందుకు ముందుకు రావడంతో సైవేల నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయని తెలిపారు. ఈ రెండు రూట్లలో రక్షణ శాఖ భూములు ఉండటంతో ఇంతకాలం రోడ్ల విస్తరణ సాధ్యంకాలేదని పేర్కొన్నారు. దశాబ్దాలపాటు ప్రభుత్వాలు ఫ్లైఓవర్ల నిర్మాణానికి చొరవ తీసుకోకపోవడంతో.. ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇంతకాలం ఇబ్బందులు పడ్డారని తెలిపారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఈ రెండు మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనేక ప్రణాళికలు రూపొందించామని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు నిరంతర సంప్రదింపులు జరిపామని తెలిపారు.
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతి సందర్భంలో అప్పటి సీఎం కేసీఆర్, తాను, ఇతర మంత్రులు, ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో విస్తృతస్థాయిలో చర్చలు జరిపామని, ప్రతి సందర్భంలోనూ కేంద్రం పెద్దలు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎలివేటెడ్ ఫె్లైఓవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అన్నిరకాల ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వానికి పంపించామని, వారు లేవనెత్తిన ప్రశ్నలకు ఎప్పటికప్పుడు సమాధానాలు అందిస్తూ ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు. ఏ ఒకరి వల్లో ఇది సాధ్యం కాలేదని, ఇది సమిష్టి విజయమని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ పదేండ్లపాటు చేసిన ఈ పోరాటంలో భాగస్వాములైన అధికారులకు, యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. తమ పోరాటాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలంగాణ ప్రజల పక్షాన కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
జేబీఎస్ నుంచి శామీర్‌పేట, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ రూట్లలో రెండు కారిడార్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని కేటీఆర్ కోరారు. కేంద్రం నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టాలని, ఎలాంటి జాప్యం చేయొద్దని హితవు పలికారు. వీటి నిర్మాణం వల్ల హైదరాబాద్ నలుదిశలా విస్తరించడంతోపాటు వాటి పరిధిలోని ప్రాంతాలు ప్రగతిపథంలో దూసుకుపోవడానికి మార్గం సుగమమైందని తెలిపారు. దశాబ్దాల నాటి సమస్య పరిష్కారం కావడంతో ప్రస్తుతం ఆయా రూట్లలో ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయని సంతోషం వ్యక్తం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్లనే స్కైవేల నిర్మాణాలకు రక్షణ శాఖ భూములను కేటాయించిందని, సీఎంగా నాడు కేసీఆర్ చేసిన కృషిని తన ఖాతాలో వేసుకొనేందుకు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం బీఆర్ఎస్ నేతలు అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, అనిల్ కూర్మాచలంతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేసిన కృషి ఫలితంగానే కంటోన్మెంట్ ప్రాంత రక్షణశాఖ భూముల కేటాయింపునకు ఇప్పుడు అనుమతులు వచ్చాయని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే ఈ అనుమతులు రాలేదని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు ఏనాడూ కంటోన్మెంట్ భూముల గురించి కేంద్రాన్ని ప్రశ్నించలేదని, పార్లమెంట్లో ప్రస్తావించనూ లేదని పేర్కొన్నారు.